Single Women Pension | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు

అర్హుల వివరాల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మంజూరు..
మరణించిన లబ్ధిదారుల పేర్లను వెంటనే తొలగించాలని అధికారులకు సీతక్క ఆదేశం

Single Women Pension | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో అర్హత కలిగిన ఒంటరి మహిళలకు ఆగస్టు 15 నుంచి కొత్త సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగు జిల్లా పర్యటన సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త పెన్షన్ల మంజూరులో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒంటరి మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించిన వెంటనే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులకు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.