Ayyanna Patrudu: జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకోవాలి…

వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ నియమాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… వైసీపీ నేతలు మాటలు వింతగా ఉన్నాయని విమర్శించారు.

అసెంబ్లీలో చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తారో, తనకూ అంత సమయం ఇవ్వాలని జగన్ అడుగుతున్నారని వెల్లడించారు. అసలు జగన్ కు ప్రతిపక్ష నేత హోదాయే లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీ నియమ నిబంధనలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీ రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అయ్యన్న వెల్లడించారు. నిర్దిష్ట కారణం వల్ల అసెంబ్లీకి రాలేకపోతున్నాను అంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వాలని… సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారని వివరించారు.

సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అలాగని, అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని స్పష్టం చేశారు. వైసీపీలో మిగతా ఎమ్మెల్యేలకు జగన్ మాట్లాడే అవకాశం ఇవ్వాలని, వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని అయ్యన్న సూచించారు. సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని జగన్ ను, వైసీపీ నేతలను కోరుతున్నానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *