రాజ్యాంగ విలువలను మంట గలుపుతున్న ఆర్ఎస్ఎస్

  • కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆగ్రహం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రాజ్యాంగ విలువలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి మంట గలుపుతోందని కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే పాల్గొన్న ప్రాంగణాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, కొంతమంది మత ఛాందసవాదులు గంగా జలంతో శుద్ధి చేసిన ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు.

మల్లికార్జున ఖార్గేకు జరిగిన అవమానం బీజేపీ విభజన రాజకీయం, సామాజిక వివక్షతకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్ల ఆయన ప్రసంగించిన వేదికను అపవిత్రంగా భావించి శుద్ధీకరణ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విలువల ఉల్లంఘన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి అస్పృశ్యత, వివక్షపూరిత చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంది సురేష్, అక్కల నాగేంద్రప్రసాద్, రాగాల రాము, పోతురాజు థామస్ పాల్, కంచర్ల నాగరాజు, రమేష్, భూక్యా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.