“గద్దె చొరవతో 40 ఏళ్ల సమస్యకు తెర”
- కామన్‌సైట్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- చిన్ని ప్రశంసలు.. గద్దెకు అభినందనలు
- క్యాబినెట్ ఆమోదంతో క్రమబద్ధీకరణకు మార్గం
- ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు విముక్తి
- కాలనీ వాసుల్లో వెల్లివిరిసిన ఆనందం
- ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
విజయవాడ,ఆంధ్రప్రభ: ఏపీఐఐసీ కాలనీలో 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కామన్‌సైట్ సమస్యకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది” అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్‌లోని ఏపీఐఐసీ కాలనీలో కామన్‌సైట్ సమస్య పరిష్కారమైన సందర్భంగా శుక్రవారం కాలనీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఎంపీ మాట్లాడారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజుతో కలిసి కాలనీకి వచ్చి పరిస్థితిని పరిశీలించారని, అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్లారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే మళ్లీ చొరవ తీసుకుని ఫైల్‌ను ముందుకు తీసుకెళ్లారని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సమస్య మళ్లీ తలెత్తకుండా క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం పొందేలా కృషి చేశారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని ఎంపీ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. కాలనీ వాసుల డిమాండ్ న్యాయబద్ధమైనదని గుర్తించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించిందన్నారు. ప్రజలకు న్యాయం జరిగిందంటే మంచి ప్రభుత్వం అధికారంలో ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. 2014–19 టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించానని తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరోసారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నానని వివరించారు.
కామన్‌సైట్ ఏపీఐఐసీ పేరుతో ఉండటంతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలించానని గద్దె రామమోహన్ తెలిపారు. ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజును కాలనీకి తీసుకువచ్చి సమస్యను వివరించడంతో పాటు అధికారులు, స్థానికులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషించామన్నారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం ద్వారా నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీలో వర్షం వచ్చినప్పుడు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడే సమస్యపై కూడా దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. ఐఐటీ ఇంజనీర్ ధనుంజయ్ సూచనలతో నీరు నిలిచే సమస్యను కొంతవరకు పరిష్కరించామని చెప్పారు. కాలనీ కామన్‌సైట్ సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఐలా ఛైర్మన్‌గా ఎన్నికైన అన్నే శివనాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్ సుంకర దుర్గాప్రసాద్‌లను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభినందించారు. జాస్తి సాంబశివరావు, పాతూరి నాగభూషణం మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో బాయన వెంకట్రావు, అబ్దుల్ కలామ్, రెడ్డి రాంబాబు, అయ్యప్పరెడ్డి, కోనేరు రాజేష్, గౌస్, జానీ తదితరులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.
