AP | అమరావతి పికిల్ బాల్ పోటీలు..

  • రాష్ట్రంలో తొలిసారి ఫ్రాంచైజీ తరహా ‘అమరావతి పికిల్‌బాల్ లీగ్’కు శ్రీకారం
  • ఆగస్టు 7 నుంచి 9 వరకు విజయవాడలో నిర్వహణ
  • మూడు రోజుల పాటు జాతీయ స్థాయి పోటీలు
  • ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  • సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు జట్ల యజమానులు..
  • ఆక్షన్ ద్వారా ఆటగాళ్ల ఎంపిక


(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లో పికిల్‌బాల్ క్రీడకు నూతన అధ్యాయానికి తెరలేస్తూ రాష్ట్రంలోనే తొలిసారిగా ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్న అమరావతి పికిల్‌బాల్ లీగ్ (ఏఎంపీఎల్)-2026′ కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ సమీపంలోని నైట్రో పికిల్‌బాల్ కేఫ్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌కు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు నిర్వాహకుడు గద్దె క్రాంతి కుమార్ తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి అధికారిక ఆహ్వానం అందజేశారు.

ప్రత్యేకంగా పికిల్ బాల్ పోటీలు..
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న అమరావతి పికిల్‌బాల్ లీగ్ రాష్ట్ర క్రీడా చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందన్నారు. అమరావతి, విజయవాడ ప్రాంతాలు పరిపాలనా కేంద్రాలుగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే వేదికలుగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌లు యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దారి చూపుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలను అమరావతి–విజయవాడ వేదికగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు

అత్యున్నత స్థాయిలో పోటీలు…
లీగ్ నిర్వాహకుడు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఆగస్టు 7 నుంచి 9 వరకు నైట్రో పికిల్‌బాల్ కోర్టులో నిరంతరాయంగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ జాతీయ స్థాయి పికిల్‌బాల్ క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొని అత్యున్నత స్థాయి పోటీలతో ప్రేక్షకులను అలరించనున్నారని చెప్పారు. ఈ లీగ్ ప్రత్యేక ఆకర్షణగా వివిధ జట్లకు ప్రముఖ సినీ నిర్మాతలు, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు ఫ్రాంచైజీ యజమానులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆటగాళ్లను వేలం (ఆక్షన్) ద్వారా ఎంపిక చేసి జట్లను రూపొందించడం వల్ల లీగ్‌కు మరింత ప్రతిష్ఠ, పోటీతత్వం పెరిగిందన్నారు. రాష్ట్రంలో పికిల్‌బాల్ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతలో ఈ క్రీడపై ఆసక్తిని పెంచడమే అమరావతి పికిల్‌బాల్ లీగ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.