స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం..

స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం..

  • నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : స్థిరమైన రాజధానితోనే రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధ్యం అని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మండలి వెంకట్రామ్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మత్సకార వికాస సమితి కార్యదర్శి లంకె యుగంధర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయటం శుభ పరిణామం అన్నారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ, రాజధాని విషయంలో అనేకసార్లు అనిశ్చిత పరిస్థితిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. నవ్యాంధ్ర ఆవిర్భావ సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి, అభివృద్ధి చేపట్టినప్పటికీ తదుపరి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మళ్ళీ అనిశ్చితి నెలకొల్పి రాష్ట్ర ప్రగతిని తుంగలో తొక్కిందన్నారు.

కూటమి ప్రభుత్వం తాజాగా చేసిన తీర్మానంతో రాష్ట్రంలో సుస్థిర ప్రగతి మార్గాలు ఏర్పడి, పెట్టుబడుల రాకకు బాటలు పడతాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రపంచ శక్తిగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతోందన్నారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11వేల కోట్లు, నాబార్డ్ నుంచి రూ.7,387 కోట్లు సమీకరించి ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తోందన్నారు. తద్వారా ఇప్పటికే ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటు చేపట్టాయన్నారు. మరో రూ.28వేల కోట్లు పెట్టుబడులు కూడా వచ్చాయన్నారు.

ఈ క్రమంలో అమరావతిని శాశ్వత రాజధానిగా ఖరారు చేయటంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి కేంద్రంలోని ఎన్.డీ.ఏ ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి పెట్టుబడులు మరింతగా వస్తాయన్నారు. ఈ సందర్భంగా అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధానిగా అసెంబ్లీ తీర్మానం పట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హర్షం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినాయకులకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. మట్టల ఆదివారం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, జనసేన పార్టీ నాయకులు చన్నగిరి సత్యనారాయణ, రెడ్రౌతు కృష్ణబాబు పాల్గొన్నారు.

Leave a Reply