22ndMayeditorial | భయంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

22ndMayeditorial | భయంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
22ndMayeditorial | భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలు..
మంచినీటి ఎద్దడి.. విలవిలలాడుతున్న గ్రామాలు
వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి.. రాత్రిళ్లు కూడా నిద్రలేని పరిస్థితి
ప్రైవేటు ట్యాంకర్ల దందా.. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం
ప్రజా రవాణా, నీటి సరఫరాపై ప్రభుత్వానికి పెరుగుతున్న ఒత్తిడి
22ndMayeditorial | ఎండలకు రోళ్ళు పగులుతున్నాయి. ఎండల తీవ్రతను వర్ణించేందుకు ఈ నానుడి వాడుకలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎండలకు భయపడి ప్రయాణాలు మానుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదా వేసుకుంటున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్ప జనం వీధుల్లోకి రావడం లేదు. చాలా ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి జనాన్ని భయపెడుతోంది. తెలంగాణలోని 20 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతోంది. పెద్దపల్లి, మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పిడుగురాళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం మామూలే. ఈ ఏడాది వేటపాలెం, అద్దంకి తదితర ప్రాంతాల్లో కూడా ఎండలు తీవ్ర స్థాయిలో కాస్తున్నాయి.
ఎండల తీవ్రతపై దశాబ్దాల క్రితం సుప్రసిద్ధ సినీ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి “కసిరే ఎండలు కాల్చునని” అనే చరణంతో ఒక గీతం రాశారు. అది గడిచిన కొద్ది రోజులుగా రోజూ గుర్తుకు వస్తోంది. ఎండలు ఈ ఏడాది ఎక్కువేనని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా, కొన్ని అత్యవసర పనుల కోసం జనం గడప దాటడం తప్పడం లేదు. ఎండల వల్ల అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. కృష్ణా, గోదావరి నదుల నీటిని ప్రాజెక్టుల ద్వారా పారిస్తున్నప్పటికీ, అందుతున్న నీరు చాలడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు నిప్పుల వానతో విలవిలలాడుతున్నాయి. ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఏసీలు ఉన్నవారు అవి లేనిదే బతకలేని స్థితి వచ్చింది. వాటికి నోచుకోని సామాన్యులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పౌరులెవ్వరూ బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, వడగాడ్పులు రాత్రి 11 దాటిన తర్వాత కూడా తీవ్రంగా వీస్తుండటంతో ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నా నిద్ర పట్టడం లేదని జనం వాపోతున్నారు.

ప్రతి ఇంట్లో తాగునీటి వినియోగం బాగా పెరిగిపోయి, నిల్వ చేసిన కుండలు, ఫ్రిడ్జ్‌లలోని నీరు నింపిన కొద్ది సేపటికే ఖాళీ అవుతోంది. గతంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడవి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతల వల్ల జనం ఊచకోతను అనుభవిస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు.
ప్రైవేటు ట్యాంకర్ల నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజల ఇబ్బందులను పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఎప్పుడో జరిగే ఎన్నికల టికెట్ల కోసం యత్నాలు జరుపుతున్నారు. మంచినీటి కొరత ఎక్కడా లేదంటూ నాయకులు చేసే ప్రకటనలు జనంలో ఆగ్రహాన్ని పుట్టిస్తున్నాయి. ఈ సీజన్‌లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నీటి కొరతను తీర్చడానికే పరిమితం కావాలి. అలాగే, దూర ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు సౌకర్యాలు కల్పించాలి.
యుద్ధం కారణంగా ఇంధనాన్ని పొదుపుగా వాడాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి. ముఖ్యంగా నగరాలు, ఓ మాదిరి పట్టణాల్లో సిటీ బస్సులు సకాలంలో తిరిగేట్టు చర్యలు తీసుకోవాలి. ప్రజల సహనాన్ని పరీక్షించేందుకు ప్రయత్నిస్తే ప్రజల ఆగ్రహం కట్టలు తెగుతుంది. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి.
