రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

  • ఎస్‌ఐ సోమేశ్వర్

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత మండల ప్రజలందరికీ అత్యంత ముఖ్యమని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని స్థానిక ఎస్‌ఐ ముత్తినేని సోమేశ్వర్ పేర్కొన్నారు. ప్రతి ప్రాణం విలువైనదని, రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఐ సోమేశ్వర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యల కంటే రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద సవాల్‌గా మారాయని పేర్కొన్నారు. వాహనం నడిపే వారు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే విధంగా వ్యవహరించాలని సూచించారు.

మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, అతివేగం, అతిమెత్తపు నమ్మకంతో డ్రైవింగ్ చేయడం వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని చెప్పారు. వాహనదారులు ఎల్లప్పుడూ పరిసరాలను గమనిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలని, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సునీత, పార్వతి, సరిత, సులోచన, నాగేశ్వరరావు, నరేష్, ఫార్మసిస్ట్ మురళీ, 108 సిబ్బంది పైలట్లు పరమ సునీల్‌కుమార్, బబ్లు, ఈఎంటీలు పరమ భాగ్యమ్మ, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply