పిల్లల ప్రాణాలు హరిస్తున్న “సరదాలు”

పిల్లల ప్రాణాలు హరిస్తున్న “సరదాలు”
సరదాలు.. ప్రమాదాలు
జాగ్రత్తలు లేకుంటే తీరని నష్టమే
మాచర్ల, ఆంధ్రప్రభ : వేసవి వచ్చింది. విద్యార్థులకు సెలవులు వచ్చాయి. మరి ఆటపాటలతో ఎండల్లో కేరింతలు కొట్టే పిల్లలను అదుపులో ఉంచటం ఎలా. ఇదే ప్రశ్న ప్రతి తల్లిదండ్రుల మదిలో తొలుస్తున్న ప్రశ్న. అటువంటి వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జరిగే ప్రమాదాలను నివారించవచ్చు.
వేసవి కాలం ఒక్క పూట బడులను పిల్లలు సరదా సమయంగా మార్చుకొంటూన్నారు. స్కూల్ పిల్లలు ఎండకు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పద్ధతిని అమలు చేస్తుంది. కానీ పిల్లలు ఈ సమయాన్ని సరదాల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రామాల్లో పిల్లలు ఈ సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా సరదాగా గడుపుతూ కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నారు.
మండే ఎండలో ఆటలు
వాతావరణ మార్పుల కారణంగా ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 కాక ముందు నుంచే వేడి విపరీతంగా ఉంటోంది. బయటకు వచ్చీ రాగానే చెమటలు పడుతున్నాయి. సూర్యుడు మన సత్తువనంతా లాగేస్తున్నాడు.సాధారణంగా వేసవి ఎండలను పెద్దలు తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆటలు ఆడుకుంటూ, అల్లరి చేసే పిల్లలు నీడలో తప్ప ఎండలో అసలు తట్టుకోలేరు. ఫలితంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తప్పక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎండలో కూడా స్కూల్, కాలేజీ పిల్లలు క్రికెట్ మరియు ఇతర ఆటలు ఆడుతూ ఆరోగ్యం కోల్పోతున్నారు. దీనికి కారణం శరీరంలో ఉన్న నీరంతా ఆవిరైపోవడం. సరైన విధంగా బాడీలో ఎలక్ట్రోలైట్స్ లేకపోతే వెంటనే ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులు పిల్లల చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారిని అలా వదిలేసి పనులకు వెళ్తే పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు ఆడుకోవడం సహజం, కానీ వేసవిలో దీన్ని కాస్త నియంత్రించాలి. లేదంటే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉదయం తొందరగా లేదా సాయంత్రం ఆలస్యంగా బయట ఆటలకు పంపించవచ్చు.ఇంట్లోనే ఆటలు, పుస్తకాలు చదవడం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
ఈతకు వెళ్లి ఇంటికి రావటం లేదు
మండే ఎండలో ఆట కేవలం ఆరోగ్యం హరిస్తే, ఈత ప్రాణాలను తీసేస్తుంది. ఇంట్లో పెద్ద వాళ్లకు తెలియకుండా, ఎవరి పర్యవేక్షణ లేకుండా స్థానికంగా అందుబాటులో ఉండే చెరువులు, కాలువలు, బావులు వంటి వాటిలో ఈతకు వెళ్లి ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.స్థానికంగా అందుబాటులో ఉండే వాటర్ క్యాన్స్ నడుముకు కట్టుకొని,లోతైన బావుల్లో దూకుతున్నారు. ఏది ఏమైనా సరదాగా ఈత కొడదామని వెళ్లి మృత్యువు ఒడిలోనికి వెళ్ళిపోతున్నారు. తీరా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తల్లిదండ్రులు అయ్యో అని వాపోతున్నారు. ఇలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే పిల్లలు స్కూల్ అయ్యాక ఎక్కడకు వెళ్తున్నారు అనే విషయంలో పిల్లలపట్ల గమనం కలిగి ఉండడం అవసరమని గ్రహించాలి. ప్రతియేటా ప్రపంచంలో సుమారు 2,36,000 మరణాలు ప్రమాదవశాత్తు మునిగిపోవుట వలన కలుగుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా. జూలై 25 వ తేదీ ప్రపంచ నీటి ప్రమాదాల నివారణ దినముగ ఐక్యరాజ్యసమితి 2021 లో ప్రకటించింది. భారతదేశములో ప్రతియేటా సుమారు 38,000 మంది నీటి ప్రమాదాలలో మునిగిపోయి మరణిస్తుంటారు.
వేసవి జాగ్రత్తలు పాటించాలి
వేసవిలో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. నీళ్లు తీసుకోవడం వల్ల చెమట, యూరిన్ రూపంలో ఆ వాటర్ కంటెంట్ అంతా ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. అలా కాకుండా నీళ్లు కూడా మెడిసిన్ లా పని చేయాలంటే అందులో కాస్తంత నిమ్మరసం కలపాలి. చిటికెడు ఉప్పు వేసుకున్నా మంచిదే. కుండలో నీళ్లైతే ఇంకా మంచిది. ఇలా నీళ్లలో నిమ్మరసం, కాస్తంత సాల్ట్ వేసి కలుపుకుని తాగితే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ వెంటనే అందుతాయి. ఎండ కారణంగా వచ్చే తలనొప్పి, నీరసం లాంటివి తగ్గిపోతాయి.బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మీ వెంటే ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు, చెరకు రసం లాంటివీ తీసుకోవాలి. తద్వారా బాడీ డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది.
వడగాడ్పులకు ఉపశమనంగా రోజులో అనేకసార్లు స్నానం చేస్తుంటారు.ఇలా చాలాసార్లు చేయటం వల్ల శరీరం బలహీనమైపోతుంది. సరాసరి చల్లని నీటిని త్రాగేస్తే శరీరం ఉన్నట్లుండి మార్పుకు లౌనై కండరాలు ముడుచుకొని పోతాయి. ఒక్కోసారి శరీరమంతా వణుకు కూడా కలుగుతుంది. అందుకే.మరీ చల్లనివి కాకుండా దొరికితే కుండనీటిని త్రాగండి. విచిత్ర మైన విషయం ఏమంటే గోరువెచ్చని నీటిని త్రాగితే దాహం తీరుతుంది.పుచ్చకాయ జ్యూస్ , సపోటా , కర్భూజా ,చెరకురసం ,నిమ్మకాయ షర్బత్ ,అల్లం ,పుదీనా ,నిమ్మరసం , ఉప్పు కలిపిన చల్లని మజ్జిగ మంచిది. వేసవిలో నూనెతో చేసిన చిరుతిండ్లు తినటం ,కాఫీ ,టీ ,మత్తు పదార్ధాలను సేవించటం ,ధూమపానం ఇవన్నీ ప్రాణాంతకమైనవే..
తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు ,జావ ,.గంజి ,సలాడ్ లవంటివి ఆరోగ్యానిన అత్యుత్తమమైనవే..
కూల్ డ్రింకులూ ,రెడీమెడ్ ఫుడ్లూ , పిజ్జార్లు ,బర్గర్లూ తింటే హైరిస్క్.శీతల పానీయాలు(కూల్ డ్రింక్స్), ఐస్ క్రీమ్స్ ఎక్కువగా ఇవ్వకూడదు. లేదంటే గొంతు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎండలో పిల్లలను ఎక్కువ ఆటలు ఆడనివ్వకూడదు.బయటికి వెళ్తే టోపీ, గొడుగు వాడేలా చూడాలి.
తీసుకువాల్సిన జాగ్రత్తలు..
- ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
- ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
- పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
- రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
- ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
- ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.
- తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి.
- పలుచగా ఉండే దుస్తులు ధరించాలి.
- ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చలువ కళ్లద్దాలు, సన్ స్క్రీన్ లోషన్ లు వాడాలి.
- వృద్ధులు ఎండాకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొన్ని సమయాల్లో ఎండవేడిమిని తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోతారు. కాబట్టి వృద్ధుల పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
