పుట్టగొడుగుల్లా వెలసిన బెల్టుషాపులు..

  • విచ్చలవిడిగా మద్యం విక్రయాలు..
  • భయాందోళనలో ప్రజలు
  • పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..
  • అధికారుల నిఘా ఎక్కడంటూ ప్రశ్నిస్తున్న స్థానికులు

దండెపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలంలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలువెత్తుతున్నాయి. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, జనావాస ప్రాంతాలు, రహదారుల వెంట అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి భయం లేకుండా కిరాణం షాపుల్లో కూడా మద్యం పెట్టి అమ్ముతున్నారు, బెల్టుషాపుల నిర్వాహకులు మద్యం విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే..

ప్రభుత్వ అనుమతులు ఉన్న మద్యం దుకాణాలకు మాత్రమే విక్రయ నిబంధనలు వర్తిస్తుండగా, వాటి పరిధికి వెలుపల పలుచోట్ల అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు గ్రామాల్లోనే మద్యం బాటిళ్లను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బెల్టుషాపులు నిర్వాహకులకు అదనపు ఆదాయ వనరుగా మారగా, సామాన్య ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.

మహిళలు, వృద్ధుల్లో ఆందోళన..

నివాస ప్రాంతాల సమీపంలో మద్యం విక్రయాలు జరగడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మద్యం సేవించిన కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని, మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యువతపై తీవ్ర ప్రభావం..

గ్రామాల్లో బెల్టుషాపులు విస్తరించడంతో యువత మద్యానికి బానిసయ్యే ప్రమాదం పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సులభంగా మద్యం అందుబాటులో ఉండటంతో కొందరు యువకులు మద్యానికి అలవాటు పడుతున్నారని, దీని ప్రభావం వారి కుటుంబాలపై పడుతోందని చెబుతున్నారు. మద్యం కోసం కుటుంబ ఆదాయాన్ని ఖర్చు చేయడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

ఎక్సైజ్ శాఖ నిఘా ఏమైంది?

బెల్టుషాపులపై నిఘా పెట్టి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బెల్టుషాపుల సమాచారం అధికారులకు తెలియదా? లేక తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అంటూ స్థానికులు నిలదీస్తున్నారు. తరచూ తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధిక ధరలకు మద్యం విక్రయాలు?

బెల్టుషాపుల్లో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అత్యవసర సమయంలో మద్యం కోసం వచ్చే వినియోగదారుల నుంచి ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఒకవైపు అక్రమ విక్రయాలు సాగుతుండగా, మరోవైపు వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందని అంటున్నారు.

అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి..

బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం అప్పుడప్పుడు తనిఖీల పేరుతో కాకుండా నిరంతరం నిఘా పెట్టి అక్రమ మద్యం విక్రయాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

ఇకనైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లుతెరిచి బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతారా? లేక గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు ఇలాగే కొనసాగుతాయా? అని దండెపల్లి మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆందోళనను అధికారులు సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.