ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత..

  • సిబ్బంది కొరతతో ప్రసూతిలు శూన్యం
  • ప్రసూతికి వచ్చిన వారిని చౌటుప్పల్ కు తరలింపు
  • రోగులకు తప్పని నిరీక్షణ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రజల డిమాండ్

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతోందని రోగులు, ప్రసూతి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నప్పటికీ, అందుకు అనుగుణంగా నర్సింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులకు సకాలంలో సేవలు అందడం లేదని ఆరోపిస్తున్నారు.అత్యవసర సమయాల్లో కూడా సేవల కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడటంతో వైద్య సేవల నిర్వహణ కూడా కష్టతరంగా మారుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన వైద్య ఆధారంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయడంతో పాటు, రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం, మూత్రశాలలకు డోర్లు అస్తవ్యస్తంగా ఉండడంతో వైద్యులతో పాటు రోగులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.

ఖాళీగా ఉన్న సిబ్బంది..

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులకు గాను ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు మరొకరు డిప్యూటేషన్ కింద మరొకచోట విధులు నిర్వహిస్తున్నారు. 9 ఆరోగ్య సెంటర్లకు గాను 18 మంది ఏఎన్ఎంలు ఉండాలి, జనగాం మహమ్మదాబాద్ ఖాళీగా ఉండడంతో 16 ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. మండలంలోని 9 పల్లె దవఖానాలకు 5 పల్లె దవఖానాలు ఏర్పాటయ్యాయి.

అందులో గుజ్జ ఖాళీగా ఉండడంతో నాలుగు పల్లె దాకాణాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మండల వ్యాప్తంగా 43 మంది ఆశా వర్కర్లు ఉండగా ఒక్క లచ్చమ్మ గూడెంలో ఖాళీగా ఉంది. పబ్లిక్ హెల్త్ నర్స్, ఫార్మసిస్ట్, సూపర్వైజర్, మెయిన్ సూపర్వైజర్, స్టాఫ్ నర్స్, మెడికల్ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సిబ్బంది కొరతతో సమస్య డాక్టర్ జోష్న..

ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉన్న సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. పరిమిత సిబ్బందితోనే విధులు నిర్వహిస్తూ రోగులకు సకాలంలో సేవలు అందిస్తున్నాము అయితే రోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో పనిభారం పెరుగుతోంది.

ఖాళీ పోస్టులను భర్తీ చేసి సిబ్బందిని పెంచితే రోగులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాము. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు ,మంచినీటి కొరత డ్రైనేజీ సమస్య, మూత్ర శాలల సమస్య తీవ్రంగా ఉంది. దీనిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించి మౌలిక సదుపాయాలను అందిస్తామని ఖాళీగా పోస్టులను భర్తీ చేస్తానన్నారు.