తూడుకుర్తిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అనంతరం గ్రామానికి చెందిన బాలపీరు కుమార్తె, నాగేంద్రం కుమార్తె ప్రతాన కార్యక్రమాలకు హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అలాగే గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ కర్ణాకర్, ఉప సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ కోటయ్య, ఇంద్రారెడ్డి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.