మంగపేటలో ఆలస్యంగా ప్రజావాణి
అధికారుల తీరుపై ప్రజల విమర్శలు
మంగపేట, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ములుగు జిల్లా మంగపేట మండలంలో సోమవారం ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించాల్సి ఉండగా.. ఉదయం 10.30 గంటలు దాటినా మంగపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమానికి హాజరు కావాల్సిన సంబంధిత అధికారుల్లో దాదాపు 50 శాతం మంది కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజావాణి ఆలస్యమైంది. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వచ్చిన ప్రజలు అధికారుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజావాణి కార్యక్రమం ఆలస్యంపై మంగపేట ఎంపీడీవో బద్రు నాయక్‌ను వివరణ కోరగా.. కార్యక్రమానికి హాజరైన కొంతమంది అధికారులు అల్పాహారం కోసం బయటకు వెళ్లారని, వారు తిరిగి వచ్చిన తర్వాత ప్రజావాణి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కొంతమంది అధికారులు తేలికగా తీసుకుంటున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. నిర్ణీత సమయానికి అధికారులు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.
