సభలో సంయమనం..
మంత్రి పొంగులేటికి ప్రశంసలు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందన
కమలాపూర్, ఆంధ్రప్రభ: కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. సభలో ఉద్రిక్తతకు అవకాశం ఉన్నప్పటికీ మంత్రి సంయమనం పాటించారని పేర్కొన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగిస్తుండగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహానికి గురికాకుండా తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూనే సభను ప్రశాంతంగా కొనసాగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా సభ కొనసాగిందని పలువురు అభిప్రాయపడ్డారు.
సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంతసేపు ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంత్రి సంయమనం పాటించడంతో పరిస్థితి అదుపులోనే కొనసాగిందని పలువురు పేర్కొన్నారు.
మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను ప్రత్యేకంగా మాట్లాడే సమయంలో వెల్లడించాల్సి ఉంటుందని సూచించారు. కార్యక్రమం చివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసింది.
