CM Orders | భూసేకరణ వేగవంతం చేయాలి…
CM Orders | భూసేకరణ వేగవంతం చేయాలి…
- పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ఫోకస్..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు నీటిపారుదల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రాజెక్టుల పురోగతిపై కీలక సూచనలు చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తికాకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవని పేర్కొంటూ, సంబంధిత జిల్లాల కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్లకు సూచించిన సీఎం, భూసేకరణ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
నారాయణపేట జిల్లాలో సీఎం పర్యటన..
అంతకుముందు నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం.. మక్తల్‌లో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS) పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలోని ప్యాకేజీ-1 పనుల వద్దకు చేరుకుని పంప్‌హౌస్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. కాంక్రీట్ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పాలమూరు జిల్లాలో సాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ సైట్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్-1 పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన లఘు చిత్రాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి ఎన్.ఎస్. బోసెరాజు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.
