TG | ఇందిరమ్మ లబ్ధిదారులకు రేవంత్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ

హైద‌రాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసింది. మొదటి దఫాలో రూ.లక్ష చెక్కులను పంపిణీ చేసింది. నోవోటెల్ హోటల్‌లో నేడు జరిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అందులో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి, మరికొందరు లక్ష రూపాయల చెక్కును అందుకున్నారు. మొదటి దఫాలో బేస్‌మెంట్ పూర్తయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందించింది. మొత్తం నాలుగు దఫాల్లో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో భాగంగా జనవరి 26న 71 వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చింది. రీ వెరిఫికేషన్ లో 6 వేల మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు. చివరికి 65 వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు దాదాపు 12 వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు.

మొదటి విడతలో మండలంలోని ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పట్నుంచి అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రాథమికంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవ ర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ.. వాటిని రీ వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *