నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా పాటీల్ నియామకం..

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ ఆదివారం అధికార బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బాధ్యతల నుంచి రిలీవ్ అవుతూ, నూతన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న హేమంత కేశవ్ పాటీల్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఆయన తక్షణమే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది నూతన కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు.

జిల్లా అభివృద్ధిలో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పాఠశాలల నాణ్యత, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని సమర్థవంతమైన పరిష్కార మార్గాలు కనుగొనడం తన విధానమని, జిల్లా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కృషి చేస్తానని హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు.
