7years | బాల్యం ముగిసిపోతోందా?

బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో శారీరక మార్పులు..
చిన్నారుల్లో ముందస్తు యుక్తవయస్సు పెరుగుతుండటంపై నిపుణుల ఆందోళన

7years | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఇంకా బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసు… పాఠశాలలో అక్షరాలు నేర్చుకోవాల్సిన సమయం… ఇంట్లో అన్న‌, అక్క‌, త‌మ్ముడు, చెల్లెల్ల‌తో ఆనందంగా గ‌డిపే స‌మ‌యం… ప్ర‌స్తుత స‌మాజంలో కొన్ని ప‌దాల‌కు అర్థం తెలియ‌ని వ‌య‌సు… పాఠ‌శాల‌లో గురువులు చెప్పే పాఠాలే అర్థం కాని వ‌య‌సు వాళ్ల‌ది.. త‌నకు తాను ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకోవాలి అనే అవ‌గాహ‌న కూడా లేని వ‌య‌సు.. ఇంకా చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం ఉన్న ఏడున్నరేళ్ల చిన్నారికి రుతుస్రావం ప్రారంభమైందనే వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అస్సాంలో వెలుగుచూసిన ఈ ఘటన ఒక్క కుటుంబానికే పరిమితం కాకుండా, చిన్నారుల్లో పెరుగుతున్న ముందస్తు యుక్తవయస్సు (ప్రికోషియస్ ప్యూబర్టీ) పై వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

సాధారణంగా బాలికల్లో 10 నుంచి 15 ఏళ్ల మధ్య రుతుస్రావం ప్రారంభమవుతుంది అని మ‌నంద‌రికీ తెలుసు. అయితే ఇటీవల కొందరు చిన్నారుల్లో ఎనిమిదేళ్లు నిండకముందే శారీరక మార్పులు కనిపిస్తున్నాయని చెప్ప‌వ‌చ్చు. కొంత‌మంది పిల్ల‌ల్లో కొన్ని అవ‌య‌వాలు క్లుప్తంగా క‌నిపిస్తాయి. 7 ఏళ్లు దాట‌గానే ఇలాంటి అవ‌య‌వ మార్పులు క‌నిపిస్తుంటాయి. అయితే ఇలా అవ‌య‌వ మార్పులు క‌నిపించిన‌ప్పుడు ఆ చిన్నారుల‌కు ఏమీ అర్థం కాని అయోమ‌యంలో ఉంటారు. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ప్రికోషియస్ ప్యూబర్టీ (Precocious Puberty) అని పిలుస్తారు.

ఎందుకిలా జరుగుతోంది?

చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడానికి ఒక్క కారణం ఉండదని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన కారణాలు, ఊబకాయం, అధికంగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, మారుతున్న జీవనశైలి వంటి అనేక అంశాలు కలిసి ఈ పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని వివరిస్తున్నారు. కొన్ని అరుదైన సందర్భాల్లో హార్మోన్ గ్రంథులు లేదా మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా కారణమవుతాయి.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన సంకేతాలు..

ఎనిమిదేళ్లలోపు బాలికల్లో రొమ్ముల పెరుగుదల, రుతుస్రావం ప్రారంభం, ఎత్తు వేగంగా పెరగడం, శరీరంపై వెంట్రుకలు రావడం, శరీర వాసనలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణంగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంత మంది బాలిక‌ల్లో 10 సంవ‌త్స‌రాలు దాటినా కూడా ఇలాంటి మార్పులు క‌నిపించ‌వు. వాళ్లు తీసుకునే ఆహార లోపం కావ‌చ్చు, మ‌రే ఇత‌ర కార‌ణాలైనా కావ‌చ్చు. ఇవి ముందస్తు యుక్తవయస్సుకు సంకేతాలు కావొచ్చని చెబుతున్నారు.

వెంటనే వైద్యులను సంప్రదించడం ఎందుకు అవసరం?

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడు లేదా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన హార్మోన్ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే భవిష్యత్తులో ఎదుగుదల, ఎముకల అభివృద్ధి, మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు.

చిన్నారి మనసును కూడా అర్థం చేసుకోవాలి..

ముందస్తు యుక్తవయస్సు కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు. ఆ వయసులో ఆ మార్పులను అర్థం చేసుకోలేని చిన్నారులు భయం, అయోమయం, ఆత్మన్యూనత వంటి మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బాలిక‌ల‌కు యుక్త వ‌య‌సు అని కూడా తెలియ‌ని ప‌సిత‌నం. యుక్త వ‌య‌సు అంటే ఏమిటి అనే కోణంలో కూడా పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా త‌ల్లిదండ్రులు వివ‌రించి చెప్పాలి.

వారికి యుక్త వ‌య‌సు అంటే ఏమిటి అనే విష‌యం అర్థం అయ్యేంత వ‌ర‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి పెద్ద‌లు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉండాలి. ఆ స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి అని కూడా నేర్పించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను మందలించడం కాకుండా, ప్రేమగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం, అవసరమైతే వైద్యులతో పాటు మానసిక నిపుణుల సలహా తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.