ఏజెన్సీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
- ఐటీడీఏల ఆధ్వర్యంలో అధికారికంగా కార్యక్రమాలు
- మన్యంలో రెపరెపలాడిన ఆదివాసీ ఆకు పచ్చ జెండా
- ఆదివాసీ చట్టాలను, హక్కులను అమలు చేయాలి
రంపచోడవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల ఆధ్వర్యంలో ఆదివాసీ, గిరిజన సంఘాలతో కలసి అధికారికంగా నిర్వహించడంతో పాటు జిల్లాలోని 12 మండలాల మండల కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ గ్రామాన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ద్విచక్ర వాహనాల ర్యాలీలు, ఆదివాసీ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మన్యంలోని ప్రతి పల్లెలో ఆదివాసీ ఆకు పచ్చ జెండా రెప రెపలాడింది. పోలవరం (రంపచోడవరం) జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఆదివాసీ చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లాలోని 9 తెగలకు చెందిన నాయకులను, ఆదివాసీ పెద్దలను, ప్రజలతో ఈ సదస్సును నిర్వహించారు. చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు ఆదివాసీ జెండాను ఎగురవేశారు.
ఐటీడీఏ నుండి చింతూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతూరు ప్రధాన సెంటర్లో ఆదివాసీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆదివాసీ సంఘాలు ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేశారు. ఏపీఆర్ జూనియర్ కళశాల ప్రాంగాణంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా గిరిజన విద్యార్ధులు చేసిన ఆదివాసీ నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీవో రామతులసి మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధే ఐటీడీఏ ధ్యేయమన్నారు.

ఆదివాసీల అభివృద్ధికి ఐటీడీఏ అహర్నిసలు పని చేయడం జరుగుతుందన్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీల అభివృద్ధికి అందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీలోని గిరిజన సమస్యలు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఐటీడీఏ మీ అందరి కోసం ఏర్పాటు- చేయబడిందని, మీకు ఏ సమస్య ఉన్నా ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ, గిరిజన సంఘాలు, ఆదివాసీ ఉద్యోగ సంఘాలు, ఆదివాసీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
