లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం..

కొడుకును కోల్పోయిన కుటుంబం గొప్ప నిర్ణయం
అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఐశ్వర్య గ్రాండ్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న వారణాసి భరద్వాజ్ (16) భవానీపురం శ్రీ చైతన్యలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఆదివారం ద్విచక్ర వాహనంపై ఫెర్రీ నుంచి రింగ్ సెంటర్ కు వస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో భరద్వాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కన్న కొడుకును కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. మరొకరి జీవితంలో వెలుగులు నింపేలా ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురిని కదిలించింది. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.