NITI Aayog | చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్
NITI Aayog | చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను వివరిస్తూ ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్‌ను ఆవిష్కరించారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు రూపొందించిన ప్రణాళికలను ఆయన సమావేశంలో వివరించారు.
సమావేశం ప్రారంభంలో ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశం ‘పాలసీ పెరాలసిస్’ నుంచి ‘పాలసీ గ్రోత్’ దిశగా అడుగులు వేసిందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని కొనియాడారు.
మానవ వనరులే అభివృద్ధికి పునాది
స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పనలో మానవ వనరుల అభివృద్ధినే ప్రధాన కేంద్రంగా తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, నీటి-ఇంధన భద్రత, అగ్రి-టెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ వంటి పది కీలక అంశాలను ఈ విజన్‌లో భాగం చేశామని చెప్పారు.
ఈ లక్ష్యాల సాధన కోసం సాంకేతికత ఆధారిత, పారదర్శక పాలనను అమలు చేస్తున్నామని వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా కీలక పనితీరు సూచికలను పర్యవేక్షిస్తున్నామని, వాతావరణం, పంటల పరిస్థితి, భూగర్భ జలాలు తదితర 41 రకాల సమాచారాన్ని రియల్ టైమ్‌లో విశ్లేషించి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో గత రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు.
పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరమేనని, అయితే తరచూ మారే విధానాలు పెట్టుబడిదారుల్లో అనిశ్చితి కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ ద్వారా స్థిరమైన పెట్టుబడి వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆరోగ్యం, విద్యలో సంస్కరణలు
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ‘సంజీవని’ కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని, ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేసి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యమని చెప్పారు. విద్యారంగంలో కూడా సమూల మార్పులు తీసుకొస్తున్నామని, గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం, ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ వ్యవస్థల ద్వారా విద్యా ఫలితాలను మెరుగుపరుస్తున్నామని వివరించారు. ‘వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్’ విధానంతో విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలు పొందుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మానవ వనరుల కొరత తలెత్తకుండా రాష్ట్రంలో ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ, కార్యాచరణ అవసరమని సూచించారు.
వికసిత్ భారత్‌కు ఏపీ పూర్తి సహకారం
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
