New Journey | భవిష్యత్తు వైపు మొదటి అడుగు..

New Journey | భవిష్యత్తు వైపు మొదటి అడుగు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అయ్యో.. మొన్నే కదా పరీక్ష రాశాం. నిన్నే కదా రిజల్ట్ వచ్చింది. అప్పుడే కాలేజీ మొదలైందా? వేసవి సెలవులు అప్పుడే పూర్తయ్యాయా? అనిపిస్తోంది కదా. అవును.. కాలం చాలా వేగంగా సాగిపోతోంది. అప్పుడే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌లోకి అడుగుపెడుతున్నావు. పాఠశాల నుంచి కాలేజీ జీవితంలోకి ప్రవేశిస్తున్నావు. అంటే, నీ భవిష్యత్తు వైపు తొలి అడుగు వేయబోతున్నావన్నమాట. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు, అలవాట్లు, చదువుపై చూపే శ్రద్ధ నీ రేపటి జీవితానికి దారి చూపుతాయి.
ఇన్నాళ్లూ సాగిన వేసవి సెలవుల సరదా ముగిసిపోయింది. మళ్లీ పుస్తకాల సంచులు భుజానికెత్తే సమయం వచ్చేసింది. ఈసారి స్కూల్ గేటు దాటి కాలేజ్ క్యాంపస్‌లోకి అడుగుపెడుతున్న పదో తరగతి విద్యార్థులకు ఇది కేవలం ఒక కొత్త విద్యాసంవత్సరం మాత్రమే కాదు.. వారి జీవితంలోనే అతిపెద్ద మలుపు!
స్కూల్ లైఫ్ వేరు.. కాలేజ్ లైఫ్ వేరు. నిన్నటివరకు మిమ్మల్ని చేతులు పట్టుకుని నడిపించిన టీచర్లు, ప్రతి చిన్న విషయానికి గైడ్ చేసిన తల్లిదండ్రులు.. ఇప్పుడు మిమ్మల్ని ఒక బాధ్యతగల పెద్దవారిగా చూడటం మొదలుపెడతారు. స్కూల్లో ఉన్నంత స్వేచ్ఛ వేరు, కాలేజీలో లభించే స్వేచ్ఛ వేరు. ఈ కొత్త ప్రపంచంలో తలకిందులు కాకుండా, కెరీర్‌ను అద్భుతంగా మలచుకోవడానికి విద్యార్థులు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? కాలేజ్ లైఫ్‌ను ఎలా లీడ్ చేయాలో ఓసారి చూద్దాం…
స్వేచ్ఛ దొరికింది.. కానీ బాధ్యత మరువొద్దు!
స్కూల్లో హోంవర్క్ చేయకపోతే అడిగే టీచర్లు ఉంటారు, ర్యాంక్ తగ్గితే పిలిచి మాట్లాడే ప్రిన్సిపాల్ ఉంటారు. కానీ కాలేజీలో అలా కాదు. క్లాస్‌కు వెళ్లాలా, వద్దా అనేది మీ ఇష్టం అన్నంత స్వేచ్ఛ కనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి.. ఈ స్వేచ్ఛ మిమ్మల్ని పాడు చేయడానికి కాదు, మీపై మీకు నమ్మకాన్ని పెంచడానికి! ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునే బాధ్యత ఇప్పుడు మీదే.
సోపతి విషయంలో జాగ్రత్త.. ‘వద్దనడం’ నేర్చుకోండి!
కాలేజీలో రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల మనస్తత్వాలు ఉన్న కొత్త స్నేహితులు పరిచయమవుతారు. మంచి స్నేహితులు మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే, చెడు అలవాట్లు ఉన్నవారు మీ భవిష్యత్తును బుూడిద చేస్తారు. ఎవరైనా తప్పుదారి పట్టిస్తుంటే ధైర్యంగా ‘నో’ (వద్దు) అని చెప్పడం అలవాటు చేసుకోండి. మీ లక్ష్యాలను గౌరవించేవారినే స్నేహితులుగా చేసుకోండి.
టైమ్ మేనేజ్‌మెంట్.. ఇంటర్ అనేది రెండు సంవత్సరాల ఆట కాదు!
టెన్త్ క్లాస్‌లో ఏడాది మొత్తం చదవకపోయినా, లాస్ట్ రెండు నెలలు కష్టపడితే మంచి మార్కులు వచ్చేసి ఉండవచ్చు. కానీ ఇంటర్మీడియట్ అలా కాదు. ఇక్కడ సిలబస్ సముద్రమంత ఉంటుంది. ఎంసెట్, నీట్, జేఈఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సాధించాలనే కల ఉంటే.. మొదటి రోజు నుంచే టైమ్ టేబుల్ ప్రకారం చదవడం మొదలుపెట్టాలి. ఇక్కడ ఒక్క రోజు టైమ్ వేస్ట్ చేసినా రేసులో వెనకబడిపోతారు.
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి
ఈ వయసులో హార్మోన్ల మార్పుల వల్ల ఆకర్షణలు, కోపాలు, ఒత్తిడి సహజం. ఎవరో ఏదో అన్నారని చదువు పాడు చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకే కుంగిపోవడం చేయొద్దు. మీ మనసులో ఎలాంటి ఆందోళన ఉన్నా తల్లిదండ్రులతో లేదా నమ్మకమైన లెక్చరర్లతో పంచుకోండి. మీ కంటే మీ భవిష్యత్తును ప్రేమించేవారు ఎవరూ ఉండరని గుర్తుంచుకోండి.
చిన్న సందేశం..
“నిన్నటివరకు మీరు ఒక చిన్న తోటలో పెరిగిన మొక్కలు. ఈరోజు విశాలమైన ప్రపంచం అనే అడవిలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ గాలివానలు వస్తాయి, ఎండలు మండుతాయి.. కానీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడితేనే మీరు ఒక పెద్ద వృక్షంగా మారి సమాజానికి నీడను ఇవ్వగలరు. కాలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి.. కానీ మీ కళ్లల్లో ఉన్న తల్లిదండ్రుల కలలను, మీ సొంత లక్ష్యాలను మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు.” కొత్త జీవితానికి, కొత్త స్నేహాలకు, మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!
