రామ్‌చరణ్ బాడీగార్డ్‌ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

రామ్‌చరణ్ బాడీగార్డ్‌ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

సాధారణంగా స్టార్ హీరోల బాడీగార్డులు పెద్దగా వార్తల్లో నిలవరు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీని చూసుకునే కెవిన్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఇటీవల విజయవాడలో జరిగిన ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఓ అభిమాని ఒక్కసారిగా రామ్ చ‌ర‌ణ్ వైపు పరుగెత్తుకుంటూ రావడంతో కెవిన్ చాకచక్యంగా స్పందించి అతడిని ఎలాంటి గందరగోళం లేకుండా పక్కకు తీసుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కెవిన్‌పై నెటిజన్ల దృష్టి పడింది.

అయితే ఆ సంఘటన తర్వాత రామ్ చరణ్ అదే అభిమానిని తిరిగి పిలిచి మాట్లాడటం, అతడి అభిమానాన్ని గౌరవించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. మరోవైపు కెవిన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిన తీరు కూడా ప్రశంసలు అందుకుంటోంది.

కెవిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

గాంబియాలో జన్మించిన కెవిన్… కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ కూడా. ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నివసిస్తున్నాడు.

కెవిన్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే దాదాపు 81,900 మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం అతడి ఫిట్‌నెస్ వీడియోలు, వర్కౌట్ సెషన్లు, సెలబ్రిటీలతో కనిపించే ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అతడి వ్యక్తిత్వం, ఫిట్‌నెస్ లెవెల్స్ చూసి చాలామంది నెటిజన్లు “హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రెజ్లింగ్ ప్రపంచంలో కూడా కెవిన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ గుర్తింపు పొందిన “ల్యామిన్ ఆఫ్ బర్రా” అనే బిరుదుతో అతడు ప్రసిద్ధి చెందాడు. గత ఏడాది నవంబరులో మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన ఎంఎంఏ పోటీల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక అతడి సేవల ఖర్చు గురించి తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. రోజువారీ ప్రాతిపదికన సేవలు అందించే కెవిన్ ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు కనిపించే కెవిన్.. అభిమానుల్లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత వైరల్ అయిన వీడియోతో ఇప్పుడు అతడి గురించి తెలుసుకోవడానికి చాలామంది గూగుల్‌లో వెతుకుతున్నారు. ఒక స్టార్ హీరో బాడీగార్డ్‌కే ఇంత భారీ ఫాలోయింగ్ ఉండటం విశేషమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెవిన్ భవిష్యత్తులో సినిమాల్లోనూ కనిపించే అవకాశం ఉందేమో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.

అలాంటి చర్చలకు కారణం లేకపోలేదు. ఎందుకంటే గతంలో కన్నడ స్టార్ హీరో యశ్ తన వ్యక్తిగత బాడీగార్డ్‌కు సినీ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యశ్.. తన భద్రతా బృందంలో పనిచేసిన వ్యక్తికి విలన్ పాత్రలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. దీంతో ఇప్పుడు కెవిన్ విషయంలోనూ అభిమానులు అదే తరహా ఊహాగానాలు వ‌స్తున్నాయి. మరి ఈ ఎంఎంఏ ఫైటర్ ప్రయాణం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Leave a Reply