గ్రామాల సమగ్ర అభివృద్ధికే గ్రామ సభలు..

గ్రామాల సమగ్ర అభివృద్ధికే గ్రామ సభలు..

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామసభలో ప్రజలతో నేరుగా చర్చలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నాగర్ కర్నూల్ మండల పరిధిలోని చందుబట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ తిరుపతి గౌడ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశమై గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై నేరుగా వివరాలు సేకరించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ గ్రామసభలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేసే వేదిక గ్రామసభ అని అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధిదీపాలు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, గ్రామసభల ద్వారా తీసుకునే నిర్ణయాలు గ్రామ ప్రగతికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు. యువత విద్య, ఉపాధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ గ్రామసభలో ఆర్డీఓ సురేష్ బాబు, డీఎస్పీ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, ఎంపీడీవో చిన్నమ్మ, ఎంపీఓ రాజీవ్ ప్రసన్నకుమార్, సెక్రటరీ అన్వేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply