మీ భవిష్యత్ ను తీర్చి దిద్దే బాధ్యత నాది
మీ భవిష్యత్ ను తీర్చి దిద్దే బాధ్యత నాది
- సిద్ధాంతం నుంచే రైతు సంక్షేమానికి మరో కీలక ముందడుగు
- మీ భూమి – మీ హక్కు గ్రామసభ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన సీఏం చంద్రబాబు నాయుడు
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : మీ భవిష్యత్తును తీర్చి దిద్దే బాధ్యత నాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో సిద్ధాంతం గ్రామ సమీపంలోని హెలిపాడ్‌కు చేరుకోగా, మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా గ్రామసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేలాది మంది టిడిపి కార్యకర్తలు, అభిమానులు, రైతులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.
సబా ప్రాంగణం కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులతో కిక్కిరిసిపోయి ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం, రైతుల ఆస్తి హక్కులను శాశ్వతంగా పరిరక్షించడం, భూ వివాదాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “భూమి రైతుకు ఆస్తి మాత్రమే కాదు, అది అతని జీవనాధారం. రైతు భూమిపై పూర్తి హక్కులు కలిగి ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భూ సంబంధిత సేవలను గ్రామ స్థాయికే తీసుకువస్తూ ప్రజలకు సులభతరం చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
అనంతరం ఎంపిక చేసిన పలువురు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. పాస్ పుస్తకాలను అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీమ్ అస్మి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, పీఏసీ చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సెల్ అడ్వైజర్ ఎం.ఏ. షరీఫ్, కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
