ఆసుపత్రిలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
ఆసుపత్రిలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి
– మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ధర్మపురి, ఆంధ్రప్రభ:
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు. సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆమె కౌన్సిల్ సభ్యులతో కలిసి ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిలోని ల్యాబ్‌లు, వైద్యుల హాజరు, వైద్య పరికరాలు, మందుల నిల్వలు, సిబ్బంది పనితీరు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకొని అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి రోగికి సరైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్య సేవలకు అవసరమైన అన్ని సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు సంగనబట్ల సంతోషి, చిపిరిశెట్టి రాజేష్, సంగి ఆనంద్, కొమురవెల్లి పవన్, జంజీరికాని సువర్ణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్.కే. షౌకత్, సుల్తానా, అశెట్టి మమత, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
