Money Mafia : వామ్మో… ‘కాల్‌మనీ’ చీకట్లు..! Andhra Prabha Top Story

Money Mafia : వామ్మో… ‘కాల్‌మనీ’ చీకట్లు..! Andhra Prabha Top Story
- బెజవాడలో మళ్లీ వడ్డీలాట దూకుడు
- ‘చెక్కు’లే అస్త్రాలు
- అప్పు తీర్చినా వీడని నక్షత్రకులు
- ఖాళీ చెక్కులతో వేధింపులు
- కోర్టు కేసుల అదిరింపులు.. బెదిరింపులు
- వన్‌టౌన్ వయా గవర్నర్‌పేట
- .
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
ఒకప్పుడు రాష్ట్రాన్ని కుదిపేసిన ‘కాల్‌మనీ’ దందా మళ్లీ బెజవాడ వీధుల్లో నీడల్లా కదులుతోందన్న ఆరోపణలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైన వారిని లక్ష్యంగా చేసుకుని మొదలయ్యే వడ్డీ వ్యవహారం.. చివరకు బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, కోర్టు కేసులు, పరువు నష్టం దాకా వెళ్లుతోందన్న ఫిర్యాదులు వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. “డబ్బు తీసుకున్నావంటే జీవితమే బందీ” అన్నట్టుగా మారుతున్న ఈ వ్యవహారంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని వన్‌టౌన్, కొత్తపేట, గవర్నర్‌పేట ప్రాంతాల్లో ఒక మార్వాడి కుటుంబం చేస్తున్న ఈ అక్రమ వడ్డీ వల బలంగా పాతుకుపోయిందన్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Money Mafia : : సహాయం పేరుతో వల…
అత్యవసర సమయాల్లో “అన్నదమ్ముల సహాయం” పేరుతో అప్పులు ఇస్తామని చేరువై, ముందుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ప్రమాదం మాత్రం అప్పు చెల్లించిన తర్వాతే మొదలవుతోందని బాధితులు చెబుతున్నారు. మొత్తం డబ్బు వడ్డీతో సహా తిరిగి చెల్లించినా.. అప్పట్లో తీసుకున్న చెక్కులు తిరిగి ఇవ్వకుండా వాటినే తర్వాత బ్లాక్‌మెయిల్‌కు సాధనాలుగా మార్చుతున్నారంటున్నారు.కొంతకాలం తర్వాత ఆ చెక్కులను మరో వ్యక్తి చేతిలో పెట్టి కోర్టుల్లో కేసులు వేయించడం, “ఇంకా బాకీ ఉంది” అంటూ భారీ మొత్తాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పోలీస్ కేసులు, పరువు నష్టం, మీడియా ప్రచారం అంటూ భయపెట్టడం జరుగుతోందన్న ఆరోపణలు నగర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
Money Mafia : పోలీస్ స్టేషన్లో కేసులు..
ఇదిలా ఉంటే, తరుణ్ కోటారి పై ఇప్పటికే మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలపై పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఇతరుల వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు, చెక్కులను సేకరించి వాటినే ఒత్తిడి సాధనాలుగా ఉపయోగిస్తున్నారన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు ఫిర్యాదులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన కాల్‌మనీ దందా మళ్లీ కొత్త ముసుగులో బయటపడుతుందా..? లేక ఇది కొందరి చేతుల్లో నడుస్తున్న బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్ మాత్రమేనా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు బెజవాడ ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వడ్డీ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, బాధితులకు రక్షణ కల్పించాలని వ్యాపార వర్గాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
