రూటు మార్చిన ప్రధాని మోదీ
చర్చ కార్యక్రమానికి సెలబ్రిటీలకు ఆహ్వానం
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడం ఎలా
ఎదుర్కొన్న కష్టాలు, జీవిత పాఠాలను తెలియజేయనున్న ప్రముఖులు
10వ తేదీన దూరదర్శన్ నేషనల్‌లో లైవ్
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ: విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మిళితం చేస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఏడేళ్లగా నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలి, చదివిన విషయాలను ఎలా ఆకలింపు చేసుకోవాలి, ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎలా రాయాలి అనే విషయాలను సోదాహరణతో వివరిస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లూ ఈ కార్యక్రమంలో ఒక్కరే పాల్గొంటూ వచ్చారు. కానీ, ఈసారి కొత్తగా బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొణే, విక్రాంత్ మాస్సేతో పాటు ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ను ‘పరీక్షా పే చర్చ’కు ఆహ్వానించారు.
ప్రశ్నలకు జవాబులు, వారి జీవితా పాఠాలు..
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కూడా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీళ్లతో పాటు అవనీ లేఖరా, రుజుతా దివేకర్, సోనాలీ సబర్వాల్, రేవంత్ హిమంత్‌సింగ్కా, గౌరవ్ చౌదరి, రాధికా గుప్తా లాంటి ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగే ఈ ప్రోగ్రామ్‌లో నేరుగా కొంతమంది విద్యార్థులు పాల్గొంటారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాది మంది ప్రధానితో కనెక్ట్ అవుతారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానం చెబుతారు. ఈసారి చాలా మంది సెలెబ్రిటీలు పాల్గొంటుండటంతో విద్యార్థుల క్వశ్చన్స్‌కు వాళ్లు కూడా ఆన్సర్స్ ఇవ్వడంతో పాటు జీవితంలో తాము ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు పంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ నేషనల్ చానల్ ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్ష్య ప్రసారం చేయనుంది.