నందికొట్కూరులో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి పూజలు
- పుట్టల వద్ద పోటెత్తిన భక్తులు..
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన నాగుల పంచమి పండుగను పురస్కరించుకుని నందికొట్కూరు పట్టణం భక్తిశ్రద్ధలతో పులకించింది. శనివారం పట్టణంలోని విద్యానగర్ నాగుల కట్ట, కాలేజీ రోడ్డులోని సుప్రసిద్ధ పుట్టల వద్ద ఉదయం నుంచే మహిళలు, భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుట్టలకు పసుపు, కుంకుమ సమర్పించి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చలిమిడి, వడపప్పు, అరటిపండ్లు, పాలు, గుడ్లు నైవేద్యంగా సమర్పించారు. తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు నాగదోషాలు తొలగిపోయి సుఖశాంతులు కలగాలని వేడుకున్నారు.

యువతులు, చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు, స్థానిక పెద్దలు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. పుట్టల పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు భక్తులు క్యూలైన్లలో వెళ్లేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతితో పాటు ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ భక్తులు ఓపికగా వేచి ఉండి మొక్కులు తీర్చుకున్నారు.
నాగుల పంచమి సందర్భంగా విద్యానగర్ నాగుల కట్ట వద్ద మహిళలు, చిన్నారులు పుట్టకు పాలు పోసి పూజలు చేశారు. సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ నాగుల పంచమి రోజు పుట్టకు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని తమ పెద్దలు చెప్పారని తెలిపారు. ప్రతి ఏటా నాగుల పంచమి సందర్భంగా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటామని చెప్పారు.
