Mega Box Office | మెగా కుటుంబం అరుదైన రికార్డు!
Mega Box Office | మెగా కుటుంబం అరుదైన రికార్డు!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్, Mega Box Office : మెగా కుటుంబానికి 2026 సంవత్సరం మరపురానిదిగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ఈ ఏడాది తండ్రి, కుమారుడు నటించిన రెండు సినిమాలు దక్షిణాదిలో అత్యధిక వసూళ్లు సాధించి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
మొదట చిరంజీవి జోరు..
చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. దీంతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ సాధించిన ఈ విజయంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొనగా, కొన్ని నెలల వ్యవధిలోనే రామ్‌చరణ్ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
తండ్రి రికార్డును దాటిన రామ్‌చరణ్..
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలైనప్పటి నుంచే భారీ వసూళ్లు నమోదు చేసింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రామ్‌చరణ్ నటన, కథ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ ప్రపంచవ్యాప్త వసూళ్లు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మొత్తం కలెక్షన్లను అధిగమించాయి. ప్రస్తుతం ఈ చిత్రం రూ.400 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకే కుటుంబం నుంచి రెండు భారీ విజయాలు
ఒకే ఏడాదిలో తండ్రి, కుమారుడు నటించిన సినిమాలు దక్షిణాది బాక్సాఫీస్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవడం అరుదైన ఘట్టంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయాలు కేవలం మెగా కుటుంబానికే కాకుండా థియేటర్లకు, పంపిణీదారులకు కూడా ఊరటనిచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి సీజన్‌లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడని సమయంలో ‘పెద్ది’ భారీ వసూళ్లు సాధించడం థియేటర్ వ్యాపారానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం.
