జొన్న రైతుల గోస పట్టదా..

జొన్నల కొనుగోలు వెంటనే చేపట్టాలి
లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం
పంట మార్పిడితో రైతులు నష్టపోయారు
మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి
మంత్రి తుమ్మల, మార్క్ ఫెడ్ అధికారులకు ఫోన్.. సానుకూల స్పందన

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జొన్న రైతుల గోస ప్రభుత్వాలకు పట్టదా అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. జొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం రామాయంపేట మార్కెట్ యార్డును బిఆర్ఎస్ నాయకులతో కలసి సందర్శించి జొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతపల్లి, కాట్రియాల, పర్వతాపూర్ గ్రామాల్లో జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా మార్క్‌ఫెడ్ ద్వారా జొన్నల కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గతంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే కొనుగోళ్లు ప్రారంభించారని గుర్తుచేశారు.

అధికారుల సూచనల మేరకు పంట మార్పిడిలో భాగంగా రైతులు జొన్న సాగు చేశారని, ఇప్పుడు పంట చేతికొచ్చినా కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. మార్పిడి ద్వారా నాలుగు లారీల జొన్నలను కొనుగోలు చేసి, మట్టిపెళ్లలు ఉన్నాయనే సాకుతో తిరస్కరించారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సోమవారంలోగా జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.