అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
- యువకుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం జాతీయ రహదారిపై శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాళేశ్వరం నుంచి అన్నారం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు సబ్‌స్టేషన్ సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురుగా మహాదేవపూర్ వైపు నుంచి వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో బైక్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కాళేశ్వరం గ్రామానికి చెందిన చాకినారపు విష్ణు (23), అలాగే ప్రస్తుతం అన్నారంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న రామిళ్ల వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, 108 అంబులెన్స్ సిబ్బంది ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో చాకినారపు విష్ణును వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మరో యువకుడు రామిళ్ల వినయ్‌ను భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
