మండలి శత జయంతి వేడుకలకు సర్వం సిద్ధం

‘మహాపురుషుడు మండలి’ నాటక ప్రదర్శనను విజయవంతం చేయాలి: సజ్జా చలపతిరావు

ఎంవీఆర్ శాస్త్రికి ‘మండలి వెంకట కృష్ణారావు శత జయంతి పురస్కారం’ ప్రదానం

చల్లపల్లి, ఆంధ్రప్రభ: తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ సీనియర్ నాయకులు సజ్జా చలపతిరావు తెలిపారు. శనివారం చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

సజ్జా రామకోటయ్య, సజ్జా రాజేష్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు వికాస కేంద్రంలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభతో పాటు ‘మహాపురుషుడు మండలి’ నాటక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రముఖ పత్రికా సంపాదకులు, పాత్రికేయ దిగ్గజం ఎంవీఆర్ శాస్త్రికి ‘మండలి వెంకట కృష్ణారావు శత జయంతి పురస్కారం’ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, విద్యావేత్త బుడ్డిగ జమిందారు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, పేదల సంక్షేమానికి చేసిన సేవలు, దివిసీమ ఉప్పెన సమయంలో ఆర్తజన బాంధవుడిగా, దివిసీమ పునర్నిర్మాతగా ఆయన పోషించిన పాత్రను కళ్లకు కట్టేలా ‘మహాపురుషుడు మండలి’ నాటకం రూపొందించామని చలపతిరావు తెలిపారు.

చల్లపల్లి పరిసర గ్రామాల ప్రజలు, కూటమి నాయకులు, మండలి అభిమానులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఏపీఎస్‌ఐడీసీ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి, టీడీపీ నాయకులు కోట సత్యనారాయణ, పైడిపాముల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.