Singapore AP Partnership | టెక్నాలజీ, ఏఐ, సెమీకండక్టర్లపై సహకారానికి ఏపీ ఆహ్వానం

Singapore AP Partnership | టెక్నాలజీ, ఏఐ, సెమీకండక్టర్లపై సహకారానికి ఏపీ ఆహ్వానం

Singapore AP Partnership | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ఇరు నేతలు పలు కీలక రంగాలపై విస్తృతంగా చర్చించారు.

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్ల రంగాల్లో సహకార అవకాశాలను సీఎం చంద్రబాబు ప్రధాని వాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. సెమీకండక్టర్ తయారీ ఎకో సిస్టమ్ అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్‌లో సింగపూర్ సహకారం అందించాలని ఆయన కోరారు.

అలాగే రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్ మెరుగుపరచడంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న పంటల గురించి వివరించిన సీఎం, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

ప్రకృతి సేద్య ఉత్పత్తుల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. అదే విధంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

అమరావతి నిర్మాణ పనులపై సింగపూర్ ప్రధాని ఆసక్తి చూపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ భేటీతో ఏపీ–సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.