మహిళల ఆర్థిక సాధికారతకు మరో ముందడుగు..

మహిళల ఆర్థిక సాధికారతకు మరో ముందడుగు..

  • మడికొండలో జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌కు శంకుస్థాపన

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో : హనుమకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డీఆర్‌డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌కు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి శంకుస్థాపన చేశారు.

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన సమాజాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా వివిధ రంగాల్లో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళలు, పెట్రోల్ బంక్ నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ప్రభుత్వం మహిళలను లబ్ధిదారులుగానే కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, మహిళలను స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆదాయ వనరుల విస్తరణకు ఈ పెట్రోల్ బంక్ దోహదపడుతుందని, మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.ఈ సందర్భంగా ఐనవోలు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ (FPO) ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యకలాపాలకు సంబంధించి మహిళా సభ్యులకు ఆర్థిక సహాయ చెక్కులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సంయుక్తంగా అందజేశారు. మహిళలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరింత ముందుకు సాగి ఆర్థికంగా బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, బీపీసీఎల్ ఎండి సుధీర్, ఐకేపీ (IKP) రీజినల్ కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐకేపీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply