సేవ్ ఫ్యూయల్ ఫర్ స్ట్రాంగర్ నేషన్..

సేవ్ ఫ్యూయల్ ఫర్ స్ట్రాంగర్ నేషన్..

కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకారం
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో వినూత్న కార్యక్రమం..
ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఆచరణకు సిబ్బంది మద్దతు
సైకిళ్లు, నడక, ప్రజా రవాణాతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు
దేశాభివృద్ధికి ఇంధన భద్రతపై అవగాహన కల్పిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్

విజయవాడ, ఆంధ్రప్రభ : ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో కృష్ణా మిల్క్ యూనియన్ చేపట్టిన “సేవ్ ఫ్యూయల్ ఫర్ స్ట్రాంగర్ నేషన్” కార్యక్రమం విశేష ఆదరణ పొందుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన ఇంధన సంరక్షణ భావనకు అనుగుణంగా కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పిలుపునిచ్చిన ఈ కార్యక్రమం ఆచరణాత్మక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఇంధన పొదుపు సందేశాన్ని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, స్వయంగా ఆచరించి చూపిన చలసాని ఆంజనేయులు ఇప్పటికే ఆదర్శంగా నిలిచారు.

మే 18న సైకిల్‌పై పాడి సహకార సంఘాలను సందర్శించి రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం మే 19న విజయవాడ నగరంలోని పాల బూత్‌లను సందర్శించి ఏజెంట్లు, వినియోగదారులతో ముఖాముఖి నిర్వహిస్తూ సేవల నాణ్యతతో పాటు ఇంధన పొదుపు అవసరంపై అవగాహన కల్పించారు. ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఆచరణ స్ఫూర్తిగా కృష్ణా మిల్క్ యూనియన్ సేల్స్ సిబ్బంది ప్రతి సోమవారం సైకిళ్లపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. అలాగే విజయవాడ, వీరవల్లి ఫ్యాక్టరీలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ప్రతి గురువారం సైకిళ్లు, నడక, ప్రజా రవాణాను వినియోగిస్తూ విధులకు హాజరవుతున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం మూడవ వారంలోనూ విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ అడ్మిన్ కార్యాలయం, ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత వాహనాలను పక్కనబెట్టి సైకిళ్లు, నడక, ప్రజా రవాణా ద్వారా కార్యాలయాలకు చేరుకున్నారు. ఇదే తరహాలో వీరవల్లి ఫ్యాక్టరీ సిబ్బంది కూడా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ఇంధన పొదుపుపై తమ సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఇంధన భద్రత ఎంత కీలకమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను నియంత్రించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చనే అవగాహనను కల్పిస్తోంది. ప్రజల్లో ఇంధన పొదుపుపై చైతన్యం పెంపొందిస్తూ, పర్యావరణ హిత జీవనశైలిని ప్రోత్సహిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడటమే కాకుండా, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించేలా ప్రేరణ కల్పిస్తున్నాయి.