సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా కృష్ణ నియామకం
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ, గరిడేపల్లి మండలం కల్మలచెరువుకు చెందిన బచ్చలకూరి కృష్ణను జిల్లా కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దశాబ్దకాలంగా పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కృష్ణకు ఈ పదవి దక్కడంపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, తన నిబద్ధత, నాయకత్వ లక్షణాలతో ఈ స్థాయికి ఎదిగారు.
గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే హుజూర్నగర్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా గత ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేర్చడంలో ముందున్నారు. బూత్ ఎన్రోలర్గా క్షేత్రస్థాయిలో పార్టీ ఓటు బ్యాంకును బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తించారు.
తన నియామకంపై బచ్చలకూరి కృష్ణ స్పందిస్తూ, తనపై నమ్మకం ఉంచిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
“రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేసేలా కృషి చేస్తాను” అని ఆయన తెలిపారు.
కృష్ణ నియామక వార్త తెలియగానే గరిడేపల్లి, హుజూర్నగర్ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
