కంకర రోడ్డుపై అదుపుతప్పిన ఎక్సెల్ వాహనం.. వృద్ధుడికి గాయాలు

కంకర రోడ్డుపై అదుపుతప్పిన ఎక్సెల్ వాహనం.. వృద్ధుడికి గాయాలు

బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికుల విజ్ఞప్తి

మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో కంకర రోడ్డుపై ఎక్సెల్ వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. జామచెట్ల బావి నుంచి రామారం వైపు వెళ్తున్న సమయంలో కొండాపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో వృద్ధుడికి మోకాళ్లు, తలకు గాయాలు కాగా, ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక ఆర్‌ఎంపీ బీసు మల్లేశ్ వెంటనే ప్రథమ చికిత్స అందించారు.

స్థానికుల కథనం ప్రకారం, ఐదు నెలల క్రితం జామచెట్ల బావి నుంచి కొండాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. అయితే కేవలం కంకర పరచి పనులను మధ్యలోనే నిలిపివేయడంతో గత నాలుగు నెలలుగా రోడ్డు పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడం, కంకర రోడ్డు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మందుల సామేల్, స్థానిక కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని బీటీ రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.