Dropouts | ఇంటింటి సర్వేతో ‘బడి ఈడు’ పిల్లల గుర్తింపు..

Dropouts | ఇంటింటి సర్వేతో ‘బడి ఈడు’ పిల్లల గుర్తింపు..

  • నాగర్ కర్నూల్ కలెక్టర్ క్లియర్ వార్నింగ్
  • బడి మానేసిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,
  • జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో బడి వయస్సులో ఉన్న ప్రతి పిల్లవాడు విద్యకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు, నమోదు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మండల, గ్రామ స్థాయి విద్యాశాఖ సిబ్బంది సమన్వయంతో ఇంటింటి సర్వేలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు మధ్యలో మానేసిన పిల్లలను వెంటనే గుర్తించి, వారికి వయస్సుకు తగిన తరగతుల్లో ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరేలా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. కూడా విద్యకు దూరం కాకూడదని తెలిపారు. ప్రత్యేకంగా వలస కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.

పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియ సులభతరం చేయడం, అవసరమైన పత్రాల సేకరణలో సహకారం అందించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. అలాగే, మధ్యలో చదువు మానేసిన పిల్లలను తిరిగి బడిలోకి తీసుకురావడానికి ప్రత్యేక పునఃప్రవేశ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యాశాఖ అధికారులు ప్రతి మండలంలో నమోదైన వివరాలను క్రమం తప్పకుండా సమీక్షించి, లక్ష్య సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply