HYD | రోడ్లపైనే సిట్టింగ్…..
- వైన్స్ సమీపంలో మందుబాబుల జాతర
- ఏకంగా ఫుట్‌పాత్‌నే ఆక్రమించి అడ్డగోలుగా తాగుతున్న వైనం
- పెట్రోలింగ్ మానేసిన పోలీసులు
- నానాటికీ శృతిమించుతున్న తాగుబోతుల ఆగడాలు
అమీర్‌పేట్, (ఆంధ్రప్రభ) : నగరంలోని పలు వైన్స్‌ల సమీపంలో మందుబాబులు రోడ్డుపైనే సిట్టింగ్ వేస్తున్నారు. ఆ ప్రాంతాలను బార్లగా మార్చేస్తున్నారు. వైన్స్‌లో మం దు కొనుగోలు చేసి.. ఆ పక్కనే కూర్చుని ఎంచక్కా తాగేస్తున్నారు. వైన్స్ పక్కనే ఉండే కొట్లలో గ్లాసులు, నీళ్లు కొనుగోలు చేసి తమ పని కానిచ్చేస్తున్నారు.
రోడ్డుపై నే పుట్‌పాత్‌లపై ఇలా తాగుతున్నా.. కనీసం అడిగే నాథుడు లేకుండా పోయాడు. నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపైనే తాగు తున్న దృశ్యాలు రోజూ దర్శనమిస్తున్నాయి. నగరంలో మందుబాబులు మద్యం తాగేందుకు ఎంచక్కా రోడ్లే బార్లగా మారుతున్నాయి.
అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్లోని రోడ్డులో ఉన్న వైన్స్ వద్ద మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. ఏకంగా రోడ్డును, ఫుట్‌పాత్‌ను అడ్డాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. దీంతో ఈ రోడ్డులో ప్రయాణించాలంటే వాహన దారులు, పాదచారులు భయాందోళ నలు వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఆర్ నగర్ లోని శ్రీ సోనీ వైన్స్ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కనీసం పోలీసులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావి స్తుంది. అదే విధంగా జూబ్లీహిల్స్ లోని ఓ వైన్స్ వద్ద రోడ్డునే బార్లుగా చేసుకుని నిత్యం మద్యం తాగుతున్నారు. పెట్రో లింగ్ పోలీసులు రోజూ ఇటు-వైపే తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదు.
HYD | జాతరను తలపిస్తున్న వైన్స్ ప్రాంతాలు…
సాధరణంగా వైన్స్ వద్దనే సర్కారు పర్మిట్ రూంలకు అనుమతి ఇచ్చింది. కానీ పర్మిట్ రూంలో కాకుండా రోడ్లపైనే మందుబాబులు మద్యం సేవిస్తున్నారు. కానీ అమీర్ పేట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పలు వైన్సుల వద్ద అటువంటి నిబంధనలు పాటించడం లేదు. మందుబాబుల కోసం ఫట్‌ఫాత్‌ను ఆనుకుని పదుల సంఖ్యలో గ్లాసులు, సిగరెట్లు అమ్మే దుకాణాలు వెలిశాయి.
దుకాణదారుల వద్ద వసూలు..
వైన్‌షాపులో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఈ దుకాణాలు వద్ద డబ్బులు తీసుకుని వీటి నిర్వహణకు అనుమతిని చ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరైనా అధికారులు తనిఖీలకు వచ్చినపుడు ఉద్యోగులు సదరు దుకాణాదారులకు సమాచారం ఇచ్చి ఆ కాసేపు అక్కడనుంచి ఖాళీ చేయిస్తారని సమాచారం.
పట్టించుకోని పోలీసులు
నిత్యం రద్దీగా ఉండే అమీర్ పేట, ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలల్లో ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. అమీర్పేట్ లోని శివ బాగ్ కాలనీలో రహదారిపై ఉన్న వైన్ మార్ట్ సైతం ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం కొనసాగిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. మరోవైపు ఈ వైన్స్ ప్రాంతంలోకి పోలీసులు కొంతకాలం నుంచి రౌండ్స్‌కు రావడం కూడా మానివేశారు. దీంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. ప్రయాణికులను తరలించే ఆటోలు, ఇతర వాహనాలపై రాళ్ళు వేయడం వంటి ఘటనలు ఈ రోడ్డులో షరామామూలే కావడం గమనార్హం.

