బుడమేరు వంతెన వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్..

బుడమేరు వంతెన వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్..

నియమాలను పాటిద్దాం.. ఇంటికి సురక్షితంగా చేరుకుందాం
అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సిఐ ప్రభాకర్.

పాయకాపురం, ఆంధ్రప్రభ : వాహనంపై సురక్షిత ప్రయాణం కొరకు హెల్మెట్ క్లిప్ తప్పనిసరి అని అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బుడమేరు వంతెన సమీపంలో హెల్మెట్ క్లిప్ ఫర్ సేఫ్ జర్నీ కార్యక్రమం నిర్వహించారు. కేవలం హెల్మెట్ ధరించడమే కాకుండా, దానికి ఉండే స్ట్రాప్ (క్లిప్) పెట్టుకోవడం ఎంత ముఖ్యమో వాహనదారులకు వివరించడం జరిగిందని తెలిపారు.

​సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ.. ​చాలామంది వాహనదారులు పోలీసుల తనిఖీలకు భయపడో లేదా నామమాత్రంగానో హెల్మెట్ ధరిస్తున్నారుకానీ, ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ తల నుండి విడిపోకుండా ఉండాలంటే క్లిప్ పెట్టుకోవడం తప్పనిసరి అన్నారు. క్లిప్ లేని హెల్మెట్ గాలిలో ఎగిరిపోయే టోపీతో సమానమన్నారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో జరిగే మరణాలలో 80శాతం తలకు తగిలే గాయాల వల్లే జరుగుతున్నాయనీ, హెల్మెట్ ధరించడం వల్ల మెదడుకు గాయం అయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందన్నారు.

హెల్మెట్ పెట్టుకున్న తర్వాత చిన్ స్ట్రాప్(గడ్డం కింద ఉండే క్లిప్) బిగించడం వల్ల, వాహనం పల్టీ కొట్టినప్పుడు కూడా హెల్మెట్ తలకే ఉంటుంది. తద్వారా ప్రాణాపాయం తప్పుతుందన్నారు. ప్రతి వాహనదారుడు తమ కోసం కాకపోయినా, ఇంట్లో ఎదురుచూసే తమ కుటుంబ సభ్యుల కోసమైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. ఈ సందర్భంగా బుడమేరు వంతెన మీదుగా వెళ్తున్న వాహనదారులను ఆపి, హెల్మెట్ క్లిప్ లేని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

స్వయంగా పోలీసు సిబ్బందే కొందరు వాహనదారులకు క్లిప్పులు తగిలించి అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారులు పోలీసుల సూచనలను సానుకూలంగా స్వీకరించి, ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ క్లిప్ ధరిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply