చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
హనుమకొండ, ఆంధ్రప్రభ: 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజినీకాంత్ కోరారు. హనుమకొండలోని 10వ డివిజన్ మచిలీబజార్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ప్రతి విడతలోనూ మరోసారి వేయించడం వల్లే చిన్నారులకు పూర్తి రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపతి రఘు, బయ్య శోభన్, మాడిశెట్టి వరుణ్, నెల్లుట్ల సారంగం, పరకాల రాము, సుక్కయ్య, కేస హరీష్, ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
