ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి
పరకాల, ఆంధ్రప్రభ: తల్లిదండ్రులు బాధ్యతగా తమ ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని పరకాల పురపాలక సంఘం 13వ వార్డు కౌన్సిలర్ బొచ్చు మాధవిలత జాన్సన్ విజ్ఞప్తి చేశారు. పరకాల పట్టణ మునిసిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో గురువారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ మాధవిలత ముఖ్య అతిథిగా హాజరై, చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్డులో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చు భాస్కర్, పట్టణ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సారయ్య, బొచ్చు మహేష్, బొచ్చు మహేందర్, ఏఎన్ఎం సునీత, ఆశావర్కర్ మేకల శైలజ తదితరులు పాల్గొన్నారు.
