Health Risks | మీ నరాలను తినేస్తోన్న ‘ఆ’ ఒక్క విటమిన్ లోపం!

Health Risks | మీ నరాలను తినేస్తోన్న ‘ఆ’ ఒక్క విటమిన్ లోపం!

Health Risks | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: మీరు రోజంతా ఎంత రెస్ట్ తీసుకున్నా ఇంకా తీవ్రమైన అలసట, నీరసంగా అనిపిస్తోందా? చేతులు, కాళ్ళు ఎవరైనా సూదులతో గుచ్చినట్లు వింతగా తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? అయితే మీ శరీరం మీకు ఒక ప్రమాద సంకేతాన్ని ఇస్తోంది. అదే… విటమిన్ బి12లోపం.

చాలామంది విటమిన్ లోపాలను చాలా తేలికగా తీసుకుంటారు. కానీ, బి12 లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో నరాల బలహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా బి12 స్థాయిలను పరీక్షించుకోవడం ఉత్తమం.

ఈ బి12 లోపం అనేది కేవలం వృద్ధులలో మాత్రమే ఎక్కువగా కనిపించేది. మారుతున్న జంక్ ఫుడ్ సంస్కృతి, జీవనశైలి కారణంగా యువతలో కూడా ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రారంభ దశలోనే ఈ బి12 లోపాన్ని గుర్తిస్తే, ఎలాంటి మందులు లేకుండా కేవలం సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

బి12 విటమిన్‌ అంటే..
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే అనేక విటమిన్లు అవసరం. వాటిలో విటమిన్ B12 (కోబాలమిన్) అత్యంత కీలకమైనది. ఇది నరాల వ్యవస్థ, మెదడు పనితీరు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, డీఎన్‌ఏ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం స్వయంగా ఈ విటమిన్‌ను తయారు చేసుకోలేకపోవడంతో ఇది ఆహారం సప్లిమెంట్ల ద్వారానే పొందాలి.

విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు..

  • ఎర్ర రక్తకణాల ఉత్పత్తి విటమిన్ బీ12 ఎర్ర రక్తకణాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత (మెగాలోబ్లాస్టిక్ అనీమియా) వచ్చే ప్రమాదం అధికం.
  • నరాల ఆరోగ్యం నరాల చుట్టూ ఉండే మైలిన్ పొరను రక్షించడంలో బి12 సహాయపడుతుంది. దీంతో నరాలు సక్రమంగా పనిచేస్తాయి.
  • మెదడు పనితీరు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక చురుకుదనం కోసం బి12 అవసరం. లోపం ఉంటే మరుపు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపించవచ్చు.
  • డీఎన్‌ఏ (DNA) నిర్మాణం కొత్త కణాల నిర్మాణం, శరీర పెరుగుదలలో బి12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  • శక్తి ఉత్పత్తి ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో బి12 సహాయపడుతుంది. అందుకే ఇది పరోక్షంగా అలసటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

యువతలో ఎందుకు పెరుతోందంటే..

  • ప్రస్తుత యువత ఫాస్ట్ ఫుడ్స్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారు. ఈ ఆహార పదార్థాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కానీ, శరీరానికి కావలసిన విటమిన్ బి12 వంటి మైక్రోన్యూట్రియెంట్స్ (పోషకాలు) అస్సలు ఉండవు.
  • ఈ మధ్య కాలంలో యువతలో ‘వీగనిజం’ (జంతువుల నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి కూడా తీసుకోకపోవడం) లేదా కఠినమైన శాకాహారం వైపు మొగ్గు చూపడం పెరిగింది. విటమిన్ బి12 సహజంగా మొక్కల నుండి వచ్చే ఆహారంలో లభించదు. శాకాహారులకు పాలు, పెరుగు, పనీర్ మాత్రమే బి12 వనరులు. వాటిని కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యువతలో ఈ లోపం తీవ్రమవుతోంది.

-యువతలో సరైన సమయానికి తినకపోవడం, మితిమీరిన ఒత్తిడి వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఎక్కువయ్యాయి. దీనికోసం వారు తరచూ వాడే యాంటాసిడ్ మాత్రలు కడుపులోని యాసిడ్‌ను తగ్గిస్తాయి. కానీ, మనం తినే ఆహారం నుండి శరీరం బి12ను గ్రహించాలీ (Absorb చేసుకోవాలి) అంటే కడుపులో తగినంత యాసిడ్ ఉండాలి. ఈ మాత్రల వాడకం వల్ల బి12 అబ్సార్ప్షన్ దెబ్బతింటుంది.

  • మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాకుండా, ప్రేగులు విటమిన్ బి12ను గ్రహించే శక్తిని కోల్పోతాయి. అలాగే స్మోకింగ్ కూడా శరీరంలో విటమిన్ల శోషణను తగ్గిస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే బి12 లోపం ఉన్నట్లే..

  • తరచూ అలసట, బలహీనత
  • తల తిరగడం
  • చేతులు, కాళ్లలో మొద్దుబారడం లేదా చిమ్మటలు
  • జ్ఞాపకశక్తి తగ్గడం
  • ఏకాగ్రత లోపించడం
  • నాలుక ఎర్రగా మారడం లేదా నొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • చర్మం పాలిపోయినట్లు కనిపించడం

బి12 ఎవరికి ఎక్కువగా లోపిస్తుంది?

-పూర్తిగా శాకాహారం తీసుకునేవారికి
-50 ఏళ్లు దాటిన వారికి
-గ్యాస్ట్రిక్ లేదా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారికి
-దీర్ఘకాలంగా కొన్ని మందులు
-గర్భిణులు, బాలింతలు

బి12 ఎక్కువగా లోపిస్తే.., ప్రమాదమే..

1) నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం అధికం.
2) మెదడు మొద్దుబారడం, మతిమరుపు వచ్చే అవకాశం
3) తీవ్రమైన డిప్రెషన్, మూడ్ స్వింగ్స్
4) ప్రాణాంతక రక్తహీనత
5) సంతానలేమి సమస్యలు

మరి శరీరానికి బి 12 అంధించడం ఎలా?
విటమిన్ B12 సహజంగా ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాల్లో లభిస్తుంది.

  • చేపలు
  • చికెన్, మటన్
  • కాలేయం (లివర్)
  • గుడ్లు
  • పాలు, పెరుగు, చీజ్
  • ఫోర్టిఫై చేసిన బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్
  • బి12 ఫోర్టిఫై చేసిన ప్లాంట్ మిల్క్స్

కూరగాయల్లో బి12 ఉంటుందా?

చాలామంది పాలకూర, మునగాకు, బీట్‌రూట్, మెంతికూర వంటి కూరగాయల్లో బి12 ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అయితే ఇది సరైన సమాచారం కాదు. ఈ కూరగాయల్లో ఫోలేట్, ఇనుము, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, విటమిన్ బి12 మాత్రం గణనీయమైన పరిమాణంలో ఉండదు. అయితే ఇవి రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరం ఇతర పోషకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో సహాయపడతాయి.

బి12 లోపం ఉందని అనుమానం వస్తే స్వయంగా సప్లిమెంట్లు తీసుకోవడం కంటే వైద్యుల సలహాతో రక్త పరీక్ష చేయించుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి మాత్రలు లేదా ఇంజెక్షన్లు సూచిస్తారు. సమతుల్య ఆహారం, అవసరమైతే ఫోర్టిఫై చేసిన ఆహారాలు తీసుకోవడం ద్వారా బి12 లోపాన్ని నివారించవచ్చు.