38 ఏళ్ల తర్వాత పరకాలకు సీఎం..

ఎన్టీఆర్ తర్వాత రేవంత్‌దే రికార్డు!
అధికారిక పర్యటన..
1988లో గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎన్టీఆర్‌..
ఇప్పుడు రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్‌ శ్రీకారం
డిగ్రీ కళాశాల, వంద పడకల ఆస్పత్రి ప్రారంభం

పరకాల,ఆంధ్రప్రభ : ఒకప్పుడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా, రెండు నియోజకవర్గాలకు ప్రధాన వాణిజ్య కూడలిగా, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పరకాల పట్టణానికి ముఖ్యమంత్రి హోదాలో మరోసారి సీఎం రానున్నారు. 1988లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పరకాల ప్రాంతంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. దాదాపు 38 ఏళ్లకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుండటంతో పరకాల పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్టీఆర్‌ తర్వాత.. రేవంత్‌ రాక

1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరకాల ప్రాంతానికి పలువురు ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ, వారి పర్యటనలు ప్రధానంగా రాజకీయ, ఎన్నికల కార్యక్రమాలకే పరిమితమైనట్లు స్థానిక రాజకీయ వర్గాలు, పాత రికార్డులు చెబుతున్నాయి. 1988 జూలై 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పరకాల సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రారంభించినట్లు స్థానికంగా నమోదైన వివరాలు పేర్కొంటున్నాయి.

ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వివిధ సందర్భాల్లో పరకాల ప్రాంతంలో పర్యటించారు. అయితే అధికారికంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే స్థాయిలో పర్యటనలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పరకాలకు వస్తున్న రేవంత్‌రెడ్డి ఆ జాబితాలో చేరనున్నారు. దీంతో ఎన్టీఆర్‌ తర్వాత పరకాలలో అధికారిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలవనున్నారు.

రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా పరకాల నియోజకవర్గంలో సుమారు రూ.484.42 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మౌలిక వసతులను మెరుగుపరిచే పలు కీలక ప్రాజెక్టులకు ఈ నిధులను వినియోగించనున్నారు. పరకాల పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, వంద పడకల ఆస్పత్రిని సీఎం ప్రారంభించనున్నారు. దీంతో ఉన్నత విద్య, వైద్య సేవలకు స్థానికంగా మరింత సౌకర్యం కలగనుంది.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం?

పరకాల పట్టణంలో చాలాకాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టనున్న ప్రత్యేక తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక విద్యా అవకాశాలు కల్పించే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ఆధునిక సాంకేతిక కేంద్రం వంటి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు.

కుంకుమేశ్వర ఆలయ మైదానంలో బహిరంగ సభ

అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పరకాలలోని కుంకుమేశ్వర ఆలయ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. పరకాల నియోజకవర్గానికి ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికలను ఈ సందర్భంగా సీఎం వివరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సభలకు భిన్నంగా ఈసారి ముఖ్యమంత్రి పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సాగనుండటం పరకాల ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది.

చరిత్రలో మరో అధ్యాయం

పరకాల రాజకీయ, సామాజిక చరిత్రలో ముఖ్యమంత్రుల పర్యటనలకు ప్రత్యేక స్థానం ఉంది. 1988లో ఎన్టీఆర్‌ పరకాల ప్రాంతానికి వచ్చి గురుకుల పాఠశాలను ప్రారంభించగా.. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రేవంత్‌రెడ్డి భారీ అభివృద్ధి కార్యక్రమాలతో పర్యటించనున్నారు. దీంతో ఎన్టీఆర్‌ నుంచి రేవంత్‌ వరకు.. పరకాల అభివృద్ధి ప్రస్థానంలో ముఖ్యమంత్రుల పర్యటనల పరంగా మరో అధ్యాయం నమోదుకానుంది.