రెండు బస్సులు ఢీ
సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రమాదం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు
పలువురికి గాయాలు
క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను రెండు గంటల శ్రమతో రక్షించిన పోలీసులు
సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో ఆకుపాముల సమీపంలో వేగంగా వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ముందున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
క్యాబిన్‌లో చిక్కుకున్న ఆర్టీసీ డ్రైవర్
ఢీకొన్న తీవ్రతకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినడంతో డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సు ముందు భాగాన్ని తొలగిస్తూ సుమారు రెండు గంటలపాటు శ్రమించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాలను ముందుకు పంపించారు.
నిద్రమత్తే కారణమా?
ప్రమాదానికి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తు ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి అసలు కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి, బస్సుల వేగం, ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి వేళల్లో దూరప్రాంతాలకు ప్రయాణించే బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిద్రమత్తుగా ఉన్నప్పుడు వాహనం నడపకుండా విశ్రాంతి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
