తీవ్ర విషాదం.. డాక్టర్ ప్రియాంక మృతి
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ : రాజమహేంద్రవరంలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) కన్నుమూశారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
ప్రసాదిత్య మాల్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా.. తొలుత రాజమహేంద్రవరంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చర్మవ్యాధుల విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. కుటుంబంలో తొలి వైద్యురాలిగా నిలిచి, వైద్య రంగంలో సేవలందించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కుమార్తెను కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించడం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రియాంక అవయవాలతో మరికొందరికి కొత్త జీవితం లభించే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యుల నిర్ణయంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర వైద్య విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
