సూర్యాపేటకు సాగునీరు.. తుంగతుర్తికి గోదావరి జలాలు..
ఆంధ్రప్రభ : దేవాదుల ఎత్తిపోతల పథకం ఆరో దశను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలంలోనే అందుబాటులోకి తీసుకొస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పునరుద్ఘాటించారు. దీంతో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను అందించే మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
సూర్యాపేటలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “సూర్యాపేట ప్రజలకు నేను మాట ఇస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంలోనే దేవాదుల ఆరో దశ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు దేవాదుల ద్వారా గోదావరి జలాలను తీసుకొస్తాం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సాగునీటి ప్రయోజనం కల్పించేందుకు రూపొందించిన కీలక సాగునీటి వ్యవస్థ అయిన దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడం, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో ఉన్న అడ్డంకులను తొలగించి, మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై చేసిన భారీ పెట్టుబడులు రైతులకు భరోసా కలిగించే సాగునీటి ప్రయోజనాలుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ఆరో దశ అందుబాటులోకి రావడం ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశమని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ఇప్పటివరకు ప్రధానంగా వర్షపాతం, స్థానిక నీటి వనరులు, కాలానుగుణంగా లభించే నీటిపై ఆధారపడి ఉందన్నారు. గోదావరి జలాలు అందుబాటులోకి వస్తే.. స్థిరమైన సాగునీటి వనరు ఏర్పడుతుందని, ప్రస్తుతం ఉన్న ఆయకట్టు మరింత బలోపేతం అవుతుందని, ఇప్పటివరకు సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
దీని ప్రయోజనాలు తుంగతుర్తికే పరిమితం కావని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాలను సూర్యాపేట జిల్లా సాగునీటి వ్యవస్థతో అనుసంధానం చేస్తే మొత్తం నీటి భద్రత మరింత పెరుగుతుందని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంపై ప్రభావం తగ్గుతుందని, అందుబాటులో ఉన్న నీటి వనరులను మెరుగ్గా వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని సాగునీటి వ్యవస్థలు, స్థానిక ప్రాజెక్టుల ద్వారా లభిస్తున్న ప్రయోజనాలకు దేవాదుల జలాలు తోడ్పడతాయని మంత్రి పేర్కొన్నారు.
సూర్యాపేటకు రూ.2,392 కోట్ల సాగునీటి ప్రోత్సాహం
దేవాదుల ఆరో దశతో పాటు సూర్యాపేట జిల్లాలో మరో మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులకు దాదాపు రూ.2,392 కోట్ల పెట్టుబడితో పనులు కొనసాగుతున్నాయని, వీటి ద్వారా సుమారు 77 వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలగనుందని చెప్పారు.
రూ.1,649 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ (MBC) ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 53 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యమని తెలిపారు. అలాగే రూ.292 కోట్లతో చేపట్టిన జవహర్ జంపాడు బ్రాంచ్ కెనాల్ ద్వారా మరో 10 వేల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
రూ.451 కోట్లతో చేపట్టిన రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 14 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, ఇతర అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేసి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మోతె, రెడ్డలగుంట, రాజీవ్ శాంతినగర్ ఆర్-9 వద్ద ఎత్తిపోతల పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ, దాని అనుబంధ కాలువల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.396 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు రూ.70 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే సూర్యాపేట జిల్లాలో సాగునీటి మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయి. జిల్లా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా మద్దతు లభిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆహార భద్రత.. రైతు సంక్షేమం రెండూ ప్రభుత్వ లక్ష్యాలు
పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలను ప్రస్తావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను సమతుల్యంగా కాపాడే విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఒకవైపు కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తూ, మరోవైపు వరి రైతుల నుంచి ధాన్యం సేకరణ, వారికి మద్దతు ధర అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో 3.82 లక్షలకుపైగా ఆహార భద్రత కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల అమలుతో ఈ వ్యవస్థ మరింత సులభతరం, పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని చెప్పారు.
2025-26 యాసంగి సీజన్లో 314 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 66,635 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు మంత్రి తెలిపారు. దాదాపు రూ.900 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్న రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున అందించే బోనస్ కింద రూ.118 కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ కొనుగోళ్లలో అత్యుత్తమ పనితీరు నమోదైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆహారం ఉత్పత్తి చేసే రైతు, ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడే వినియోగదారు ఇద్దరి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రైతు భరోసా.. రైతు బీమాతో రైతులకు అండ
సూర్యాపేట జిల్లాలో 2026-27 వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకం కింద 2.90 లక్షలకుపైగా రైతుల ఖాతాల్లో రూ.364 కోట్లకు పైగా జమ చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతు బీమా పథకం కింద మరణించిన 689 మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.34 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు.
వర్షపాతం, నీటి లభ్యత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. వరి సాగుకు అనుకూలత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజలు, మిరప, ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, కూరగాయల సాగు ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందేలా ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.
అలాగే, సూర్యాపేట జిల్లాలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా దాదాపు 5.68 కోట్ల ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ.343 కోట్లకుపైగా ప్రయోజనం లభించిందని చెప్పారు. రాయితీ సిలిండర్ పథకం కింద 5.52 లక్షలకుపైగా ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు. అలాగే 1.91 లక్షలకుపైగా కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్నాయని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సూర్యాపేట జిల్లాలో 12,868 ఇళ్లు కేటాయించామని, 7,928 ఇళ్లకు మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 6 వేలకు పైగా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. హుజూర్‌నగర్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 2,160 ఇళ్ల ప్రాజెక్టును పూర్తి చేశామని, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.
ప్రజల అభివృద్ధే లక్ష్యం..
ఈ ప్రాంత ప్రజలతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ఆలోచనలు అభివృద్ధికి ఎప్పటికీ అడ్డంకిగా మారవు. సూర్యాపేట జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిజాయితీగా, నిరంతరం పనిచేస్తాం అని మంత్రి అన్నారు. తన ప్రసంగాన్ని “జై హింద్.. జై తెలంగాణ” నినాదంతో ముగించారు.
సూర్యాపేటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐఏఎస్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. నరసింహ, ఐపీఎస్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
