Gadwal పట్టపగలే తాళం వేసిన ఇంట్లో దొంగతనం
Gadwal పట్టపగలే తాళం వేసిన ఇంట్లో దొంగతనం
- 12 తులాల బంగారం, 60 తులాల వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
గద్వాల Gadwal
(ప్రతినిధి), ఆంధ్రప్రభ:
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ కాలనీలో పట్టపగలే భారీ దొంగతనం చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.
బాధితుడు మహ్మద్ రహమత్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఉదయం 10:45 గంటల సమయంలో విధులకు వెళ్లారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.
ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దొంగలు ఇంటిని లక్ష్యంగా చేసుకుని లోపలికి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోని బీరువాను పగలగొట్టి అందులో దాచిన సుమారు 12 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.6,000 నగదును దోచుకెళ్లారు.
మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో రహమత్ పాషా ఇంటికి తిరిగి రాగా, తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఈ భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
