బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి
బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి
- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ:
ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై మాట్లాడలేని బీజేపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. రామకృష్ణాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో చూపిస్తూ రాజకీయ నాటకాలు ఆడటం హాస్యాస్పదమని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులపై బురదజల్లే ప్రయత్నాలు ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. చెన్నూరు అభివృద్ధి చేయకుండా క్రెడిట్ కోసం పోటీపడటం బీజేపీ అలవాటుగా మారిందని విమర్శించారు. సింగరేణి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు చాలీచాలని పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ వచ్చేలా కేంద్రం రూ.150 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్‌లో డిమాండ్ చేశారని గుర్తుచేశారు.
ప్రతి ఏడాది కోటి ఉద్యోగాలు, నల్లధనం రాబట్టడం, రైతు ఆదాయం రెట్టింపు, ధరల నియంత్రణ వంటి హామీల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, గతంలో ఆందోళన చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ధైర్యం ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధరలు తగ్గించాలని సవాల్ విసిరారు.
తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీలు, ఉపాధి అవకాశాలు తీసుకురాలేకపోయారని ఆరోపించారు. ప్రజలకు అభివృద్ధి ఎవరు చేస్తున్నారో తెలుసని, అసత్య ప్రచారాలతో ఎక్కువకాలం మోసం చేయలేరని అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మల్లేష్, ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు గోపు రాజం, బత్తుల వేణు, ఏల్పుల సత్యనారాయణ, సురేందర్, కార్యదర్శులు గోళ్ల మల్లేష్, నర్రా శ్రీనివాస్, భైర మల్లేష్, కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
